ఎంపీలతో రాజీనామాలు చేయించి, ప్రత్యేక హోదా సాధించే వరకూ ఢిల్లీ వదిలేదే లేదంటూ భీష్మించిన వైకాపా ఎంపీల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనారోగ్య కారణాలతో వారిని ఆసుపత్రికి తరలించారనీ, ఎంపీలు వద్దంటున్నా ఫ్లూయిడ్స్ ఎక్కించి, దీక్ష భగ్నం చేశారంటూ వైకాపా నేతలు అంటున్నారు. ఏదైతేనేం, ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన వైకాపా ఢిల్లీ పోరాటం కూడా చివరికి రాష్ట్రానికే చేరుకుంది. మొత్తంగా, హోదా పోరు పేరుతో వైకాపా చేసిన ప్రయత్నాలూ, దీక్షలపై ఢిల్లీ రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందనే వ్యక్తమౌతోందని చెప్పాలి. దీక్ష పేరుతో హంగామా చేసినా.. భాజపా సర్కారును ఏమాత్రమూ ప్రభావితం చేయలేకపోయారన్నది వాస్తవం. సరే, ఎలాగూ కేంద్రం స్పందించే పరిస్థితిలో లేదన్నది అందరికీ తెలిసినా… ఇతర పార్టీల నుంచి కూడా ఆశించిన స్థాయిలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు.
తాము చేస్తున్న దీక్షలకు టీడీపీ మద్దతు ఇవ్వాలనీ, ఆ పార్టీ ఎంపీలూ రాజీనామాలు చేయాలనీ, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారనీ.. ఇలా టీడీపీ వ్యతిరేక ధోరణిలోనే వైకాపా ప్రయత్నాలు సాగాయి.పేరుకు మాత్రమే ప్రత్యేక హోదా దీక్ష, కానీ వారి ఫోకస్ అంతా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయలేదూ, హోదా అంశంలో చంద్రబాబు ఫెయిల్ కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మాత్రమే విమర్శలు చేస్తూ కాలయాపన చేశారు. ఈ క్రమంలో తమ దీక్షలకు మద్దతుగా ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు సాగలేకపోలేకపోయారు. ఆ దిశగా వైకాపా కొన్ని ప్రయత్నం చేసినా… ఇతర పార్టీల నుంచి స్పందన కొరవడిందనడానికి తృణమూల్ కాంగ్రెస్ స్పందనే ఉదాహరణగా చెప్పొచ్చు..!
దీక్ష మొదలుపెట్టిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గుర్ని అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి తరలించిన తరువాత… తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వైకాపా స్పందించిందట! విశ్వసనీయ సమాచారం ప్రకారం… ‘మీ పార్టీ ప్రతినిధులను మా ఎంపీల దీక్షా శిబిరానికి పంపించాలని’ వైకాపా నేతలు కోరారట. కానీ, తృణమూల్ నుంచి సానుకూల స్పందన రాలేదనీ, పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఒకట్రెండు రోజుల్లో ఆ పార్టీ నేతలను వచ్చే అవకాశం ఉందంటూ ఓ వైకాపా నేత జాతీయ మీడియాతో ఓ మూడ్రోజుల కిందట చెప్పారు. కానీ, ఆ తరువాత తృణమూల్ నుంచి ఎవ్వరూ వచ్చింది లేదు. సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి. రాజా, శరద్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డి మాత్రమే వైకాపా ఎంపీల దీక్షా శిబిరాలకు వచ్చి, పలకరించి వెళ్లారు. దీక్షలు ముగిసిపోయాయి.
వైకాపా ఎంపీల దీక్షకు ఇతర పార్టీ నుంచి స్పందన రాకపోవడానికి అసలు కారణం అందరికీ తెలిసిందే. భాజపా విషయంలో వైకాపా సానుకూల ధోరణిలో ఉంది. ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమిస్తున్నా… కేంద్రాన్ని ప్రశ్నించే స్థాయిలోగానీ, భాజపాకి వ్యతిరేకంగా వైకాపా పోరాటం చేస్తోందన్న నమ్మకంగానీ ఎవ్వరికీ కలగలేదు. లేదంటే, భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఇలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాయి..? పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానం పెట్టిన దగ్గర్నుంచీ… ఎంపీల రాజీనామాలూ దీక్షల వరకూ ‘వైకాపా పోరాటం భాజపాకి వ్యతిరేకంగా సాగుతోంద’న్న బలమైన అభిప్రాయాన్ని కలిగించలేకపోయారన్నది వాస్తవం.