అవును, ఇప్పుడిదే చర్చ నడుస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో. చిరంజీవితో సినిమాఛాన్స్ కొట్టాలంటే సులువైన దారి ఇదే. చరణ్ తో ఒక సినిమా చేసి సత్తా నిరూపించుకుంటే చాలు, చిరంజీవి నుంచి పిలుపు వస్తుంది.
సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ తో చిరంజీవి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి ముందు రామ్ చరణ్ తో ధృవ సినిమా తీసి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. సినిమా హిట్ కావడంతో పాటు దర్శకుడి పని తీరు కూడా నచ్చడంతో చిరంజీవిని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు సుకుమార్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. రంగస్థలం సినిమాతో తన చరణ్ కెరీర్ తోపాటు తన కెరీర్లో కూడా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న సుకుమార్ పై చిరంజీవి దృష్టి పడ్డట్టు తెలుస్తోంది. తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కథ సిద్ధమవాలి, అది అందరికీ నచ్చాలి లాంటి తతంగాలన్నీ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.
అలాగే దర్శకుడు బోయపాటి విషయంలో కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. నిజానికి బోయపాటితో సినిమా చేయాలని చిరంజీవి ఇదివరకే కమిట్ అయి ఉన్నాడు. కథ సిద్ధమవడం, గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించాలని భావించడం కూడా జరిగింది. అయితే అనుకోని కారణాలతో సైరా ప్రాజెక్టు ముందుకు రావడం వల్ల బోయపాటి సినిమా వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిట్టైతే ఆ ప్రాజెక్టు మళ్లీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కాబట్టి ఏ లెక్కన చూసుకున్నా, చరణ్ తో హిట్టుకొడితే చిరంజీవి దృష్టిలో పడటం, పని తీరు నచ్చితే చిరంజీవిని దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేయడం సులభంగా కనిపిస్తోంది!!