ఈనెల 16న ఆంధ్రా బంద్ కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్ కి ప్రధాన ప్రతిపక్షం వైకాపాతోపాటు, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలపై దాడులు, ప్రతిపక్ష వైకాపా ఎంపీలు చేసిన దీక్షలను భగ్నం కలిగించిన కేంద్రం తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్టు హోదా సాధన సమితి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల్నీ, ఆత్మ గౌరవాన్ని కేంద్రం సర్వనాశనం చేస్తోందనీ, అందుకే బంద్ కి పిలుపునిస్తున్నట్టుగా చలసాని శ్రీనివాస్ అన్నారు. బంద్ నిర్వహించడం తమకు ఎలాంటి ఆనందాన్నిచ్చే అంశం కాదనీ, కానీ ఆంధ్రుల ఆవేదనను కేంద్రానికి వినిపించాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నామని ఆయన అన్నారు.
అయితే, ఈ బంద్ పిలుపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందన మరోలా ఉంది. బంద్, రాస్తారోకోలు చేస్తే నష్టపోయేది మనమేనని అన్నారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే వాళ్ల మీద పోరాడాల్సింది పోయి, రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మనల్ని మనం నష్టపరచుకోవడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఇక్కడ జన జీవనం స్తంభింపజేయడం ద్వారా నష్టం మనకే అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రంపై పోరాడాల్సిన ఈ సమయంలో, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే విధంగా బంద్ లు చేయడం సరికాదన్నారు. మనం పోరాడాల్సింది మోడీపైన అనీ, ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో ఏ కార్యక్రమాలు చేపట్టినా, అవి ప్రజలను చైతన్యవంతం చేసేవిగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని, ఈ తరుణంలో ప్రజా చైతన్యం కోసం ప్రయత్నించాలన్నారు. గతంలో కాంగ్రెస్ హేతుబద్ధత లేని విభజన చేసిందనీ, దాంతో ఇప్పటికీ కాంగ్రెస్ ను క్షమించే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా అన్నారు. భాజపాకి ఇక్కడ ఒక్క ఓటు లేదనీ, ఎప్పడూ సీట్లు గెలవలేదనీ, అలాంటి పార్టీలపై పోరాడాల్సిందిపోయి, మనల్ని మనం శిక్షించుకోవడం మంచిది కాదన్నారు. దీని వల్ల ఏపీ అభివృద్ధి కాదని వారు ఇంకా ఆనందంగా ఉంటారన్నారు.