శ్రీరెడ్డిని తెలుగు చిత్రసీమ నుంచి దాదాపుగా బహిష్కరిస్తూ.. `మా` ఆమధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ‘మా’ సభ్యులెవ్వరూ ఆమెతో కలసి నటించరని, `మా `సభ్యత్వం కూడా ఇచ్చేది లేదని `మా` అధ్యక్షుడు శివాజీ రాజా తేల్చి చెప్పేశారు. `మా` సభ్యులు కూడా శ్రీరెడ్డిపై కారాలూ మిరియాలూ నూరేశారు. ఇప్పుడు `మా` ప్లేటు మార్చేసింది. `శ్రీరెడ్డితో నటించడానికి సిద్ధంగానే ఉన్నాం..` అంటూ వెనకడుగు వేసింది. ఈ మాట చెప్పడానికి ఈరోజు సాయంత్రం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అప్పటి ప్రెస్ మీట్లో ఉన్న ఆవేశం ఇప్పుడు లేదు. సరికదా.. శ్రీరెడ్డి విషయంలో పూర్తిగా మెత్తబడిపోయింది. `శ్రీరెడ్డికి ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్థమే. అంతేకాదు. `మా` సభ్యత్వం విషయంలోనూ జనరల్ బాడీ మీటింగులో చర్చిస్తాం` అన్నారు శివాజీ రాజా. “అవకాశాలు ఇప్పించడం `మా`వంతు కాదు. కానీ మేం కొంతమందికి అవకాశాలు ఇప్పించడానికి ప్రయత్నించాం. ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎవ్వరితో పగలు పెంచుకోవాలని లేదు. ఆరోజు శ్రీరెడ్డి ప్రవర్తన చూసి మేం మనస్థాపానికి గురయ్యాం. ఇప్పుడు కొంతమంది పెద్దలు పిలిచి మాట్లాడారు. నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం“ అని శివాజీ రాజా చెప్పారు. `మా` సభ్యత్వం కోసం ఇన్నాళ్లూ పోరాడిన శ్రీరెడ్డి ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.