రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ఓట్ల లెక్కలు లాభ నష్టాలు హెచ్చు తగ్గులు ఎవరికి నచ్చినట్టు వారు అంచనా వేసుకుంటారు. జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నుంచి విడగొట్టుకోవడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతాయని చాలామంది అంటుంటారు. అదే జరిగితే వైసీపీకి నష్టం అనుకోవాలి. అయితే విచిత్రంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరు పవన్ ఎంత చురుగ్గా పనిచేస్తే తమకు అంత మేలంటున్నారు. వారి తర్కం విచిత్రంగా వుంది. బిజెపి జనసేన దూరం కావడం వల్ల తెలుగుదేశం వంటరిగా మిగిలింది. ఇక చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కారనే వాతావరణం పెరుగుతున్నది. మిగిలింది పవన్ జగన్. వీరిలో జగన్ గతసారి చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు.ఇప్పుడు పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఆదరణ బాగా వుంది. ఆయనతో పోలిస్తే పవన్ వనరులూ సైన్యం తక్కువ. అసలు తాను ముఖ్యమంత్రిని కావాలని ఆయనే అనుకోవడం లేదు. కాని ఆయన విమర్శల వల్ల చంద్రబాబు బలహీనపడ్డారన్నది నిజం. మరి అలాటప్పుడు తర్వాత స్థానంలో వున్న జగన్ ప్రజలను ఆకట్టుకోగలుగుతారు గాని పవన్ పాత్ర పెద్దగా వుండదు. కాబట్టి ఈ లాజిక్ ప్రకారం చూస్తే వచ్చేసారి జగన్కు అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయి. ఇది నాతో ఒక సీనియర్ నాయకుడు చెప్పిన థియరీ. ముందే అన్నట్టు ఎవరి అంచనాలు ఆశలూ వారివి.