అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ చేస్తామని ముందుకొచ్చిన జీ.ఎస్.ఎల్. గ్రూప్, తరువాత మాట మార్చి వెనక్కి తగ్గింది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడలో భాగమే అంటూ వైకాపా విమర్శలు గుప్పిస్తోంది. వేలాది ఎకరాల భూములను తమ సొంతం చేసుకునేందుకే చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారంటూ సాక్షిలో కథనాలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపాపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. జీ గ్రూప్ వెనక్కి వెళ్లడానికి కారణం వైకాపా అని ఆయన అంటున్నారు. ఆ పార్టీ నాయకులు బెదిరించడం వల్లనే జీ గ్రూపు భయపడిపోయిందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనీ, ఈ విషయాన్ని జి.ఎస్.ఎల్. గ్రూపునకు చెందినవారే ఆఫ్ ద రికార్డ్ చెప్పారన్నారు.
లావాదేవీ అంతా అయిపోయిన తరువాత, చివరి నిమిషంలో ఇలా మాట మార్చారంటే కారణం ఈ ఒత్తిళ్లే అని కుటుంబరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ విషయంలో ఏ గ్రూపు వచ్చినా అది కోర్టు ద్వారానే రావాలనీ, జీ గ్రూపు కూడా కోర్టు అనుమతితోనే వచ్చిందనీ, రూ. 10 కోట్లు కట్టిన తరువాత కూడా ఆ గ్రూపు వెనక్కి వెళ్లిందంటే కారణం వారిలో అనుమానాలు రేకెత్తడమే అన్నారు. దీనికి కారణం ఎవరనేది తాము వాకబు చేస్తే ఈ విషయాలు బయటకి వస్తున్నాయన్నారు. వైకాపా నేతలు ఆ గ్రూపునకు చెందిన కీలక వ్యక్తులను కలిసిన ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయనీ, సరైన సమయంలో వాటిని విడుదల చేస్తామని కుటుంబరావు చెప్పారు. భాజపాతో కూడా వారికి సమస్యల ఉండొచ్చనే బెదిరింపులకు వైకాపా పాల్పడిందన్నారు.
అగ్రిగోల్డ్ కేసులో ఏదైనా అవినీతి ఆరోపణ ఉన్నా, తెలుగుదేశం నాయకుడు ఎవరైనా ఉన్నారని అనుమానం ఉన్నా సమగ్ర ఆధారాలతోటి హైకోర్టులో వైకాపా ఇంప్లిడ్ పిటిషన్ వెయ్యాలంటూ కుటుంబరావు సవాలు చేశారు. వార్తా కథనాల ద్వారా, విమర్శల ద్వారా ప్రజలను బెదరగొట్టడం సరికాదనీ, కోర్టు హియరింగ్ కి 25వ తేదీ వరకూ సమయం ఉందనీ, ఈలోగా ఇంప్లీడ్ అవ్వాలంటూ మరోసారి ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు. ఓపక్క బాధితులు నష్టపోతూ ఉంటే, సమస్యను మరింత జఠిలం చేయడం కోసమే వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సమస్యను ఒక సమస్యగా ఉంటేనే దాన్ని రాజకీయం చెయ్యొచ్చని వైకాపా చూస్తోందన్నారు. ఇలా చేస్తే బాధితుల ఉసరుకు పార్టీకి తగులుతుందని వ్యాఖ్యానించారు. మరి, ప్రభుత్వం సవాలు చేస్తున్నట్టుగా అగ్రిగోల్డ్ కేసులో వైకాపా ఇంప్లీడ్ అవుతుందా, లేదంటే సాక్షి కథనాలూ, నేతల విమర్శలకే పరిమితం అవుతుందా..?