త్వరలో భారతీయ తెరపైకి ‘రంగస్థలం’ రాబోతోంది. భారతీయ ప్రేక్షకులు అందరికీ తెలుగు ప్రేక్షకులు మెచ్చిన రంగస్థలాన్ని చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ, తమిళ్, మలయాళం, భోజ్పురి తదితర భాషలన్నీ భారతీయ తెరలో భాగమే. గతంలో ఓ భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసే ప్రక్రియ ఎక్కువ జరిగేది. ఇప్పుడూ జరుగుతోంది. ఇదే సమయంలో డబ్బింగ్ సినిమాలూ వున్నాయి. అయితే.. స్ట్రయిట్ సినిమాల తరహాలో డబ్బింగ్ సినిమాలకు వసూళ్లు రావడం తక్కువ. ముఖ్యంగా హిందీ మార్కెట్టులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన మన తెలుగు సినిమాలు భారీ విజయాలు సాధించడం సందర్భాలు అరుదు. దీన్ని ‘బాహుబలి’ చెరిపేసింది. మంచి సినిమాకు భాషలు ఎల్లలు కాబోవని నిరూపించింది. ఇదే రూటును చాలా మంది ఫాలో అవుతున్నారు. సినిమా తీసేటప్పుడు హిందీ, తమిళ్, ఇతర భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
‘రంగస్థలం’ టీమ్ కాస్త లేటుగా ఈ ట్రెండున్బు ఫాలో అవుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తీయాలనుకున్నారు. తరవాత తెలుగులో మాత్రమే తీసి, తమిళంలో డబ్బింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో ప్రేక్షకుల స్పందన చూసిన తరవాత తమిళంతో పాటు హిందీ, భోజ్పురి, మలయాళం, ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. డబ్బింగ్ పనులు త్వరలో మొదలుకానున్నట్టు సమాచారం.