సినిమా రివ్యూలు, రేటింగులను ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్… సినిమా సెలబ్రిటీలు సైతం చదువుతారు. ఫాలో అవుతుంటారు. అందుకు ఉదాహరణ… పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. అబ్బాయ్ రామ్‌చరణ్ నటించిన తాజా సినిమా ‘రంగస్థలం’ విజయోత్సవం సాక్షిగా రేటింగులు గురించి ప్రస్తావించారు బాబాయ్ పవన్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే ఆనందంగా వుందని ఆయన చెప్పారు. తరవాత ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ బెస్ట్ సినిమాల స్థాయిలో, అంతకు మించి దాటి ‘రంగస్థలం’కి రేటింగులు రావడంతో ఆనంద పడ్డానని, గర్వపడ్డానని పవన్ పేర్కొన్నారు. ఈ రేటింగుల గోల ఎందుకు? అంటే… అప్పుడెప్పుడో ‘తొలిప్రేమ’ తరవాత మళ్లీ ‘రంగస్థలం’ సినిమాను పవన్ థియేటర్లో చూశారు. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడానికి రేటింగులే కారణం అట. ఇంగ్లీష్ మూవీ డేటాబేస్ వెబ్‌సైట్ ఐఎమ్‌బిడిలో ‘రంగస్థలం’కి వచ్చిన రేటింగ్ గురించి పవన్ ప్రస్తావించారు.
హాలీవుడ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’, అలాగే ‘ది షాషాంక్ రెడెంప్షన్’ కంటే మా అబ్బాయి సినిమాకి ఎక్కువ రేటింగు ఇచ్చారని పవన్ చెప్పుకొచ్చారు. అదేంటి? అంత గొప్ప సినిమానా? అనుకున్నాననీ. తీరా థియేటర్‌కి వెళ్ళాక, ‘రంగస్థలం’ అనే ఊరిలో ప్రేక్షక పాత్రలా కూర్చుని సినిమా చూసి వచ్చానని తెలిపారు. సమాజానికి ఇటువంటి సినిమాలు అవసరమని పవన్ అన్నారు. అబ్బాయ్ సినిమాను తెగ పొగిడారు.