సాధారణంగా పవన్ కల్యాణ్‌కి మైకు పట్టుకుంటే మాటలు రావు. అది సినిమా ఫంక్షన్ అయితే అస్సలు రావు. తన సినిమాల గురించి మాట్లాడడానికే మొహమాటపడిపోతుంటాడు పవన్. మరొకరి ఫంక్షన్ అయితే పొడిపొడిగా మాట్లాడేసి వెళ్లిపోతుంటాడు. అలాంటిది రంగస్థలం సక్సెస్ మీట్లో్ సుదీర్ఘంగా సాగిన పవన్ స్పీచ్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసేలా సాగింది పవన్ స్పీచ్. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా గుర్తు చేసుకున్నాడు. ఆఖరికి జబర్దస్త్ బ్యాచ్‌తో సహా. అన్నిటిలోనూ హైలెట్ ఏంటంటే.. రంగస్థలం సినిమాని ఆస్కార్‌కి పంపాలని స్టేట్మెంట్ ఇవ్వడం.
ఇదంతా ఒక ఎత్తు.. బాహుబలితో పోలిస్తూ చరణ్ మాట్లాడడం మరో ఎత్తు. బాహుబలిని అప్పట్లో ఎలా ప్రోత్సహించాలో.. ఇప్పుడు రంగస్థలం సినిమానీ అలానే ప్రోత్సహించాలని కోరడం కాస్త ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా అనిపించింది. బాహుబలి పాన్ ఇండియా ఇమేజ్‌తో జనంలోకి వెళ్లింది. ఆ సినిమా మార్కెట్, దానికొచ్చిన క్రేజ్ పూర్తిగా వేరు. పైగా అది మిగిలిన భాషల్లోనూ ఆడింది. రంగస్థలం అలా కాదు. ఇదంతా పక్కన పెడితే.. ‘వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా’ అనే మరో మాట కూడా చర్చకు దారితీసేదే. పవన్ ఎప్పుడూ, ఏ సినిమా ఫంక్షన్లోనూ ఇలా మాట్లాడింది లేదు. వర్గాలు, రాజకీయాలు అన్నాడంటే సినిమా పరిశ్రమలో వర్గాల కుమ్ములాటలూ, రాజకీయాలూ ఉన్నట్టే కదా?
ఓ సినిమా కోసం పవన్ ఇంతగా గొంతు చించుకోవడం వెనుక కారణం ఏమిటన్నది అంతుపట్టదు. ఇది వరకూ చరణ్‌కి విజయాలొచ్చాయి. మగధీర లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తీసినప్పుడు కూడా పవన్ ఇంతలా స్పందించలేదు. ఇప్పుడే పవన్ వేదిక ఎక్కడం, చరణ్‌ని ఆకాశానికి ఎత్తేయడం ఎందుకన్నది అభిమానుల్ని వెంటాడుతున్న ప్రశ్న. మొన్న సినిమా చూడడం, సక్సెస్ మీట్‌కి వస్తానడడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ, అనుమానాలూ రావు. కానీ ఈ సినిమాకి తానే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు మరీ నెత్తిన పెట్టుకున్నాడు. దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటో?