వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో ద్వంద వైఖరి ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలు. ఎప్పటివో వార్తలు తవ్వడం ఎందుకు? తాజా ప్రత్యేక హోదా ఉద్యమంలో రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ వైఖరిని, బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… ఢిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ పెద్దలతో సామరస్య భేటీలకు తహతహాలాడతారు. ఈ ద్వంద వైఖరిని, ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్రెడ్డికి చెందిన ‘సాక్షి’ పత్రిక కూడా అదే విధంగా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
జనసేన అధ్యక్షుడు, సినిమా నటుడు పవన్‌కల్యాణ్‌పై ‘సాక్షి’ సినిమా పేజీలో కొన్ని రోజుల కిందట నిషేధం విధించారు. పవన్ సినిమా వార్తలను ప్రచురించడం మానేసి చాలా రోజులయింది. అలాగే, పవన్ హాజరైన సినిమా వేడుకలకు సంబంధించి వార్తను ప్రచురిస్తే అందులో పవన్ ఫోటో గానీ, స్పీచ్ గానీ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సదరు కార్యక్రమానికి పవన్ హాజరైనట్టు చిన్న ముక్క రాసి వదిలేస్తారు. అప్పట్లో సామాన్య ప్రజలు, ప్రేక్షకుల్లో ఇది చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో పవన్‌ని పోటీగా భావించారో? లేదా అసలు లెక్కలోకి తీసుకోలేదో? అతణ్ణి మాత్రం పేజీలో రాకుండా చూసుకుంటున్నారు. పవన్ అభిమానులు సైతం సాక్షిలో పవన్ ఫొటో కనపడదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అటువంటి సమయంలో ఉన్నట్టుండి పవన్ ప్రత్యేక హోదా పాదయాత్రకు సాక్షిలో ప్రముఖంగా వార్త రాస్తే పాఠకులు ఆశ్చర్యపోయారు. సాక్షిలో మళ్లీ కనిపిస్తాడని ఆశించారు. ఆలా ఆశించినవాళ్లకు ఈ రోజు మళ్లీ నిరాశ ఎదురైంది. ‘సాక్షి’ సినిమా పేజీలో పవన్ కనిపించలేదు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ‘రంగస్థలం’ విజయోత్సవం వార్త కూడా కనిపించలేదు.
స్టార్ హీరోల సినిమా వేడుకలు ఎంత ఆలస్యంగా జరిగినా ప్రధాన పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలలో వాటికి కవరేజీ ఇస్తున్నారు. జాతీయ అవార్డుల ప్రకటనతో సినిమా పేజీని నింపేసిన ఈనాడు, ‘రంగస్థలం’ వార్తను మెయిన్ పేజీకి ఇచ్చింది. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలు సినిమా పేజీలో ఇచ్చాయి. సాక్షిలో మాత్రం అసలు అటువంటి కార్యక్రమం జరిగిందని రాలేదు. అలాగని, సినిమా పేజీ పూర్తిగా జాతీయ అవార్డులకు చెందిన వార్తలతో నింపేశారా? అంటే అదీ లేదు. మామూలు వార్తలు రాశారు. ‘మెర్క్యూరీ’ రివ్యూ రాశారు. పవన్ హాజరైన ‘రంగస్థలం’ విజయోత్సవాన్ని ఎందుకు వదిలేశారో? చూస్తుంటే పవన్ మీద సినిమాలో నిషేధం కొనసాగుతున్నట్టు ఉందండోయ్. రాజకీయ పేజీలో ఒక వైఖరి, సినిమా పేజీల్లో మరో వైఖరి… ‘సాక్షి’ పత్రిక ద్వంద ప్రమాణాలు ఏంటో? రేపటి పేజీలో పవన్ లేకుండా ‘రంగస్థలం’ వార్త వస్తుందేమో!