శ్రీరెడ్డి విషయంలో ‘మా’ ప్రవర్తించిన తీరు చిత్రసీమని ఆశ్చర్యపరిచింది. `మేం నీకు సభ్యత్వం ఇవ్వం… మేం ఎవ్వరం నటించం` అంటూ ఓ ప్రెస్ మీట్లో మా తేల్చిచెప్పేసింది. ఎప్పుడైతే మా తరపున తలుపులు మూసుకుపోయాయో… అప్పుడు శ్రీరెడ్డి మరింతగా రెచ్చిపోవడం ప్రారంభించింది. దగ్గుబాటి అభిరామ్ పేరు బయటపెట్టి, ఇంకా తన దగ్గర పెద్ద లిస్టే ఉందని హెచ్చరికలు జారీ చేసింది. `మా` వైఖరి వల్లే… శ్రీరెడ్డిపై సానుభూతి ఎక్కువైందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. అప్పటి వరకూ.. శ్రీరెడ్డి అంటే లైట్ తీసుకున్నవాళ్లు కూడా `పాపం.. ` అనే స్థాయికి తీసుకొచ్చింది `మా`. టీవీ 9 చర్చావేదికలో శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం, లైవ్ డిస్కర్షన్‌లో శ్రీదేవి తల్లి కూడా తన గొంతు వినిపించడంతో – శ్రీరెడ్డిపై సానుభూతి పవనాలు మరింతగా పెరిగాయి.
బాణాలు తమవైపు దూసుకొస్తున్నాయి అని తెలుసుకున్న `మా`… ఆ తరవాత వెనకడుగు వేసింది. వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి… శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తి వేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోజు ప్రెస్‌మీట్లో మా వైఖరి కూడా ఆశ్చర్యం కలిగించింది. పాత్రికేయులు ప్రశ్నలు లేననెత్తితే.. సమాధానం చెప్పడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడలేదు. జెమిని కిరణ్ అయితే.. ప్రెస్ మీట్లోంచి అర్థాంతరంగా లేచి వెళ్లిపోయారు. `మేం చెప్పడానికే వచ్చాం.. బదులు ఇవ్వడానికి కాదు` అన్నట్టు సాగింది ఆ ప్రెస్ మీట్. `మా` ఏర్పాటు చేసిన రెండు ప్రెస్ మీట్లూ పరిశ్రమకు తప్పుడు సంకేతాలను అందించినదే. నాలుగ్గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయాలు బజారుకొచ్చాయంటే అందులో `మా` మొండివైఖరి. తొందరపాటు కూడా ఉన్నాయి. ఈ విషయంలో శివాజీరాజా ఒక్కడినీ నిందించడం కరెక్ట్ కాదు. `మా` తీసుకొన్న సమిష్టి నిర్ణయం అది. రెండో ప్రెస్ మీట్ తరవాత కూడా శ్రీరెడ్డి తన జోరు తగ్గించలేదు. తగ్గిస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడు శ్రీరెడ్డి దూసుకుపోవడానికి, చొచ్చుకుపోవడానికి, పరిశ్రమపై తనకున్న కోపాన్నంతా తీర్చేసుకోవడానికి మరిన్ని దారులు చూపించినట్టైంది. మరి ఈ రచ్చ.. ఎంతమందిని రోడ్డుకీడుస్తుందో, ఎప్పుడు శాంతిస్తుందో?