ప్రత్యేక హోదా పోరాటంలో భాగం చివరి అస్త్రాన్ని వైకాపా ప్రయోగించేసిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ రాజీనామాలు చేశారు. అయితే, ఈ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఇంతవరకూ ఆమోదించలేదు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ తన సొంత నియోజక వర్గం పర్యటనలో ఉన్నారు. ఆమె వచ్చిన వెంటనే రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని వైకాపా ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆమోదింపజేసుకునేందుకు వైకాపా వెనకాడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయనీ, తాము ఉప ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా అలాంటి విమర్శల్ని తిప్పికొట్టాలన్నది ప్రతిపక్ష పార్టీ వ్యూహంగా వినిపిస్తోంది..!
స్పీకర్ తో రాజీనామా పత్రాలపై ఆమోదముద్ర వేయించుకుంటే కడప, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి ఎంపీ స్థానాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమంతో పార్టీ బలం పుంజుకుందనీ, ఈ సెంటిమెంట్ ఆధారంగా ఉప ఎన్నికలకు వెళ్లిపోవచ్చనే ధీమాతో వైకాపా శ్రేణులు ఉన్నాయని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే… అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా గెలుపు మరింత సులువు అవుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారట. హోదా సెంటిమెంట్ ను ఇలా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ ఉంది.
స్పీకర్ ఆమోదించినంత మాత్రాన వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటుందన్న ధీమా లేదు. సాంకేతికంగా, సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఉప ఎన్నికల నిర్వహణ అనేది ఎలక్షన్ కమిషన్ విచక్షణకు సంబంధించిన విషయం. కానీ, వైకాపా వాదన ఏంటంటే.. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికన్నా ఎక్కువే సమయం ఉంది కదా, కాబట్టి ఉప ఎన్నికలు వస్తాయన్నదే వారి అంచనా. కానీ, అవసరమనుకుంటే ఆర్నెల్ల ముందే వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీలూ, లోక్ సభ ఎన్నికలను కలిపి నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ ఆ మధ్య ప్రధాని మోడీ కూడా సంకేతాలు ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తరువాత జమిలి ఎన్నికలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో ఉప ఎన్నికలు జరగాలంటే ఇన్ని పరిస్థితులు అనుకూలించాలనేది వాస్తవం.
అయితే, ఇక్కడ గమనించాల్సిన కీలకాంశం… వైకాపా ప్రత్యేక హోదా పోరాటం తీరు! కేంద్రంపై వారు తెచ్చిన ఒత్తిడేంటో మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమో ఉప ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. హోదా సెంటిమెంట్ తో గెలిచి చూపిస్తామని ఉవ్విళ్లూరుతున్నారు. అంటే, ప్రత్యేక హోదా అనేది ఫక్తు రాజకీయాంశంగా మాత్రమే వైకాపా చూస్తోందని చెప్పడానికి ఈ సాక్ష్యం చాలదా..!