మల్టీస్టారర్ సిన్మాలకు బ్రాండ్ అంబాసిడర్ ‘విక్టరీ’ వెంకటేష్… మెగా ఫ్యామిలీ మెంబర్, అభిమానులు ముద్దుగా ‘మెగా ప్రిన్స్’ అని పిలిచే హీరో వరుణ్ తేజ్ కలిసి నటించనున్న సినిమా ‘ఎఫ్2’. ఫన్ & ఫ్రస్టేషన్… అనేది ఉపశీర్షిక. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముహూర్తం సిద్ధమైంది. జూన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అతని దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారధ్యంలో సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’, ‘రాజా.. ది గ్రేట్’ సినిమాలకు నిర్మాత ‘దిల్’ రాజే. దర్శక నిర్మాతల కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రమిది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. తాజాగా ఇద్దరు హీరోలకు దర్శకుడు ఫైనల్ వెర్షన్ వినిపించగా, ఇద్దరూ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించనున్నారు.