తనయుడు ఆకాశ్ పూరిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ‘మెహబూబా’ ప్రెస్‌మీట్‌కి పూరి జగన్నాథ్ హాజరు కాలేదు. తనయుడి సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మించారు. ఆల్రెడీ సినిమాను చూసిన ‘దిల్’ రాజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి హక్కులు కొనేసుకున్నారు. ఇటీవల పూరి తీసిన సినిమాల కంటే ట్రైలర్ బాగుంది. కానీ, ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పూరి థియేటర్లలో ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేసిన సందర్భాలు వున్నాయి. అయితే… దానికి తోడు ‘దిల్’ రాజు సినిమా కొన్నారు అనేసరికి సినిమాపై క్రేజ్ కొంచెం పెరిగింది. సినిమా పనుల్లో వున్నారో… మరొకటో… పూరి ప్రెస్‌మీట్‌కి రాలేదు. తనయుడు ఆకాశ్ పూరి మాత్రం ప్రెస్‌మీట్‌లో ఓ పెద్ద మాట మాట్లాడాడు.
“అందరూ మీ నాన్న నిన్ను హీరోగా లాంచ్ చేస్తున్నారు. నువ్వు వెరీ లక్కీ అంటున్నారు. కానీ, ‘మెహబూబా’ లాంటి గొప్ప సినిమాతో మా నాన్నని నేను లాంచ్ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను” అని ఆకాశ్ పూరి భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ సినిమాలు ఆశించిన రీతిలో హిట్ కాకున్నా… దర్శకుడిగా పూరి సరిగా తీయకున్నా… వినిపించే మాట ఒక్కటే. ‘మనసు పెడితే పూరి మంచి సినిమా తీయగలడు’ అని. పూరి మాత్రం హిట్ సినిమాలకు, ప్లాప్ సినిమాలకు ఒకే రకంగా కథ రాశానని అంటుంటారు. తనయుడిని హీరోగా పరిచయం చేసే సినిమా కావొచ్చు లేదా వరుస పరాజయాల తరవాత తనను తాను నిరూపించుకోవాలనే కసి కావొచ్చు… ‘మెహబూబా’పై పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వుంటారని ఆశించవచ్చు. అయితే… తండ్రిని రీ లాంచ్ చేస్తున్నానని ఆకాశ్ పూరి ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం ఓవర్ అయిందేమోనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశ్ పూరికి తండ్రి ప్రతిభపై, తన నటనపై, సినిమాపై విశ్వాసమా? అతి విశ్వాసమా? మే11న సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.