ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని సోమవారం నాడే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి పంపినట్టు సమాచారం. నిజానికి, ఏపీ భాజపాకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందనే చర్చ కొన్ని నెలలుగా జరుగుతున్నదే. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త కార్యవర్గం ఏర్పాటుపై భాజపా దృష్టి పెట్టింది. దీనికి అనుగుణంగానే హరిబాబు రాజీనామా చేశారని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందనే కథనాలూ ఆ మధ్య వచ్చాయి.
అమిత్ షాకి రాజీనామా అందిన వెంటనే ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ మొదలౌతుందని సమాచారం. మరో వారం రోజుల్లో ఏపీ భాజపా అధ్యక్షుడు ఎవరనేది స్పష్టత వచ్చేస్తుందని భాజపా వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది. ఈయనతోపాటు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ పేర్లు కూడా బాగానే వినిపించాయి. అయితే, ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాపు సామాజిక వర్గానికి చెందినవారికి పదవి ఇస్తారా, బీసీలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఏదేమైనా, ఏపీ భాజపా అధ్యక్ష పదవి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సాములాంటి బాధ్యతే అవుతుంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రంగా ఉంది. దానికంటే తీవ్రంగా భాజపాపై వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమౌతోంది. గడచిన నాలుగేళ్లలో ఆంధ్రాను అన్నివిధాలుగా మోడీ సర్కారు నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయం బలంగా ఉంది. దీనికి ఎదురొడ్డి, కేంద్రం ఏపీకి చాలా చేసిందని చాటి చెప్పడం అంత ఈజీ కాదు. ఆ పనిని కంభంపాటి హరిబాబు కూడా సమర్థంగా చేయలేకపోయారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్ష స్థానంలోకి ఎవరొచ్చినా ఇలాంటి సవాళ్లు చాలా ఎదుర్కోవాలి. పోనీ, పార్టీకి ఇప్పటికే ఒక బలమైన కేడర్, రాష్ట్ర స్థాయి నాయకత్వం లాంటివి ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకతను తట్టుకునే వ్యూహాలను అనుకున్నట్టుగా అమలు చేసే అవకాశం ఉంటుంది. పార్టీని కొత్తగా నిర్మించాల్సిన బాధ్యత కూడా అధ్యక్షుడిపైనే ఉంటుంది. ఇవన్నీ సమర్థంగా తట్టుకుని, పార్టీని నడిపించే సారథి ఎవరనేది త్వరలో తేలిపోతుంది.