మహేశ్‌బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడ్రోజులు మాత్రమే వుంది. ఈ కార్యక్రమానికి వ్యూహకర్త (అదేనండీ… దర్శకుడు) కొరటాల శివ అయితే… ఆయన వ్యూహాన్ని పక్కాగా అమలు పరిచింది (అదేనండీ… సినిమాను నిర్మించింది) డీవీవీ దానయ్య. రాజకీయభాష పక్కన పెట్టి సినిమా భాషలోకి వస్తే… మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్ అనే నేను’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా డీవీవీ దానయ్యతో ఇంటర్వ్యూ…
ఏంటండీ… చంద్రబాబునాయుడు పుట్టినరోజున సినిమాను విడుదల చేస్తున్నారు?
అయ్యో! ఆయన పుట్టినరోజున విడుదల చేయాలని చేస్తున్నది కాదు. మహేశ్‌గారి అమ్మగారి పుట్టినరోజు కూడా అదే రోజు. ఫారిన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన చెబితే తెలిసింది. అంతకు మించి ఆలోచించలేదు.
రాజకీయ నేపథ్యంలో సినిమా… ఏ పార్టీకి మద్దతు ఇచ్చేలా వుంటుంది?
ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేలా సినిమా తీయలేదు. మేము ఎవరిపైనా విమర్శలు చేయలేదు. మంచి సందేశంతో, ముఖ్యమంత్రి ఈవిధంగా వుంటే బావుంటుందనే ఆలోచనతో తీశామంతే.
మహేశ్‌ని ముఖ్యమంత్రిగా చూపించాలనే ఆలోచన ఎవరిది?
దర్శకుడు కొరటాల శివగారిదే. మహేశ్‌తో సినిమా తీయాలనేది నా కల. ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా. ఆయన వెనుక తిరిగేవాణ్ణి. దర్శకుడు కొరటాల శివ ఈ కథ తీసుకురావడంతో నా కల నెరవేరింది. మా సంస్థ గర్వపడే చిత్రమిది. మాకు ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చినందుకు కొరటాలకు జీవితాంతం రుణపడి వుంటాను.
ముఖ్యమంత్రిగా మహేశ్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి?
సర్ప్రైజ్ అయ్యాను. థియేటర్లలో ప్రేక్షకులు కూడా అంతే సర్ప్రైజ్ అవుతారు.
సెట్స్‌లో మహేశ్ ఎలా వుంటారు?
రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు అందరితో నేను సినిమాలు తీశాను. వాళ్ళు అందరితో నాకు మంచి రిలేషన్షిప్ వుంది. అందరూ మంచోళ్ళు. అయితే.. మహేశ్‌తో కొంచెం ఎక్కువ రిలేషన్షిప్ వుంది. ఆయన సెట్స్‌లో వుంటే నవ్వులే నవ్వులు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తారు. ఉదయం ఎంత ఎనర్జీతో సెట్స్‌కి వస్తారో… సాయంత్రం వెళ్ళేటప్పుడు అంతే ఎనర్జీతో వుంటారు. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. మళ్ళీ మళ్ళీ ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్నా.
హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర ఎలా వుంటుంది?
మంచి పాత్ర చేసింది. ఉత్తరాది అమ్మాయి అయినా సినిమా చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ రాదు. తెలుగమ్మాయిలా చక్కగా చేసింది. హిందీలో రెండు మూడు సినిమాలు చేసింది. తెలుగులో ఆ అమ్మాయి చేస్తుందో లేదో గాని చేస్తే పెద్ద హీరోయిన్ అవుతుంది.
మళ్ళీ మీ సినిమాలో చేస్తుంది కదా…
నవ్వులు… రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో ఆ అమ్మాయి చేస్తుంది.
ఆ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది?
రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నెల 21న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. అందులో రామ్ చరణ్ జాయిన్ అవుతారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నిర్మించే సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
ఈ ఏడాది ఆఖరున షూటింగ్ ప్రారంభమవుతుంది. అదీ మా సంస్థ గర్వపడే సినిమా అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలోనూ సినిమా చేయాలనేది నా కల. 2006 నుంచి ఆయన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇప్పటికి దొరికారు. భారీ బడ్జెట్ సినిమా అది.