‘సైరా’ కోసం అమితాబ్ బచ్చన్‌ని తీసుకోవడం వెనుక చిరు అండ్ కో ఎత్తుగడ ఏమిటన్నది స్పష్టం. ఈ సినిమాకి బాలీవుడ్ స్థాయిలో మార్కెట్ చేయాలని. అక్కడ కూడా భారీ రేటుకి ఈ సినిమాని అమ్మాలని. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. తద్వారా… ‘సైరా’కి బాహుబలి రేంజు హైపు రావాలని. అందులో భాగంగానే అమితాబ్ బచ్చన్‌ని ఒప్పించి, మెప్పించి.. `సైరా` టీమ్ లోకి తీసుకొచ్చారు. ఇందులో బిగ్ బీకి కీలకమైన పాత్రే దక్కింది. ‘సైరా’కి గురువుగా ఆయన కనిపించనున్నారు. అయితే సైరా గురువు పాత్రలతో బిగ్ బీకి రాసిన సన్నివేశాలు మూడే. స్క్రిప్టు ప్రకారం సినిమా ద్వితీయార్థంలో ఈ పాత్ర కనిపిస్తుంది. అయితే ఇప్పుడు `సైరా` బృందo ఆలోచన మారింది. ప్రధమార్థంలోనూ బిగ్ బీ కనిపించాలని, అందుకు తగిన సన్నివేశాల్ని జోడించాలని రచయిత బృందాన్ని దర్శకుడినీ చిరు ఆదేశించాడట. ఈ విషయమై బిగ్ బిని సంప్రదించి మరిన్ని కాల్షీట్లు అడిగారని తెలుస్తోంది. నిజానికి అమితాబ్ పై తీయాల్సిన సన్నివేశాలన్నీ సింగిల్ షెడ్యూల్‌లో ముగించి ఆయన్ని పంపించేయాలి. అయితే.. సన్నివేశాల్ని పొడిగించడం వల్ల… బిగ్ బి కాల్షీట్లు మరిన్ని కావాల్సివచ్చాయి. చిరు మాటపై గౌరవంతో అమితాబ్ బచ్చన్ కూడా ఈ మార్పులకు అంగీకరించినట్టు తెలుస్తోంది.