ఇదేదో కొత్త సామెతలా పనికొచ్చేట్టుంది కదా! ఆంధ్రా భాజపా నేతలు.. ఆ పార్టీ పాలన గురించి, మోడీ సర్కారు తీరు గురించి మాట్లాడిన మాటలు కొన్ని గుర్తు చేసుకోండి. ‘ఛీ ఛీ.. అవినీతిపరులకు మోడీ ఆమడ దూరంలో ఉంటారు! దేశంలోని అవినీతిని కడిగేయడానికే భాజపా గాట్టిగా నడుం బిగించుకుంది. నీతిమంతమైన పాలన అందిస్తున్న ఒక్క భాజపా సర్కారు మాత్రమే’.. అబ్బో ఇలాంటివి చాలానే చెప్పారు! అంతెందుకు… ‘జగన్ తో పొత్తా… అవినీతి కేసుల్లో కోర్టుకెళ్తున్న జగన్ ఎక్కడ, నీతిమంతమైన పాలన అందిస్తున్న మోడీ ఎక్కడ..? ఆ ఊహే అసాధ్యం’ అని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్ చెప్పేవారు. అయితే, ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే… ఇవి ఆంధ్రాకు మాత్రమే పరిమితమైన ప్రవచనాలు..! లేదా, కర్ణాటక నుంచి మార్పు మొదలైందని అని కూడా అనుకోవచ్చు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భాజపా అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే… ఈ జాబితాలో గాలి సోమశేఖర రెడ్డికి సీటిచ్చారు. బళ్లారి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈయన గాలి జనార్థన రెడ్డి సోదరుడు. మైనింగ్ పేరుతో గాలి సోదరులు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు . గతంలో, ఎడ్యూరప్ప క్యాబినెట్ లో గాలి జనార్థన రెడ్డి మంత్రిగా ఉండగా, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. అదే సమయంలో జడ్జికి లంచం ఇవ్వజూపిన కేసులో కూడా ఈ సోమశేఖర రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయనతోపాటు, గాలి జనార్థన్ రెడ్డి సన్నిహితుడైన శ్రీరాములు బంధువు ఫకీరప్ప, అవినీతి కేసు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సుబ్రహ్మణ్య నాయుడు, కృష్ణయ్య శెట్టిలకు కూడా భాజపా టిక్కెట్లు ఇచ్చింది. గాలి సోదరుడికి టిక్కెట్ విషయంపై భాజపా నేతలు సమర్థింపు ఏంటంటే… ఈ విషయంలో పార్టీ రాజీపడాల్సి వచ్చిందనీ, బళ్లారిలో గెలుపు ముఖ్యం కదా అని ఆ పార్టీ నేత ఒకరు చెప్పడం విశేషం!
అవినీతి రహిత భారతం కోసం అహరహం పాటుపడుతుండే భారతీయ జనతా పార్టీ, అవినీతిపరుల ఛాయల్ని కూడా సహించలేని మోడీ నాయకత్వం… కర్ణాటక ఎన్నికలకు వచ్చేసరికి ‘గెలుపు’ పేరుతో రాజీ పడిందని వారే ఒప్పుకోవడం గమనార్హం. ఆ మధ్య అమిత్ షా నోరు జారుతూ… ‘అత్యంత అవినీతి గల ప్రభుత్వం ఎవరిదంటే, అది ఎడ్యూరప్ప సర్కారు మాత్రమే’ అన్నారు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు!