భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చాలారోజుల తరువాత మీడియాలో ఇష్టాగోష్టిగా ఢిల్లీలో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికలతోపాటు, ఆంధ్రా హామీలపై కూడా స్పందించారు. కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. గతంలో తాను చెప్పినట్టుగానే కర్ణాటకలో కూడా తామే అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశంతో పొత్తు విషయమై మాట్లాడుతూ… తాము కావాలని పొత్తు తెంచుకోలేదనీ, తమను టీడీపీ వద్దనుకుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తమకు ఎలాంటి గొడవా లేదనీ, గొడవ పెట్టుకోవాలని కూడా అనుకోవడం లేదని అమిత్ షా అన్నారు.
ఇదే సమయంలో 2019 లోక్ సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ… మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందనీ, ఎంపీ సీట్ల సంఖ్యలో కాస్త మార్పు ఉన్నా, భాజపాయే బలమైన పార్టీగా నిలుస్తుందన్నారు. ఇదే సమయంలో ఆంధ్రా గురించి విలేకరులు ఓ ప్రశ్న వేశారు. ఆంధ్రాలో భాజపా మీద వ్యతిరేకత పెరుగుతోంది కదా, ఆ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటని అడిగారు. ఒక్కోసారి కొన్ని చోట్ల ఇలాంటి వ్యతిరేకత తప్పదని, ఇలాంటివి భాజపా గతంలో చాలా ఎదుర్కొందని అమిత్ షా చెప్పారు. దక్షిణాదిలో తమకు సీట్ల సంఖ్య తగ్గినా ఇతర ప్రాంతాల నుంచి అదనంగా 80కి పైగా భాజపాకి రాబోతున్నాయన్న ధీమా వ్యక్తం చేశారు.
అంటే, భాజపాకి ఆంధ్రా అనేది కేవలం అంకెల లెక్క మాత్రమే! ఇక్కడున్న పాతిక ఎంపీ సీట్లు వారి గణనలో లేవు. ఏపీలో సీట్లు రాకపోతే.. మరో చోట నుంచి వాటిని రాబట్టుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎన్నికల తరువాత ఏపీ నుంచి ఎవరో ఒకరు తమకు మద్దతుగా వస్తే… ఆ సీట్లు కూడా బోనస్ అన్నట్టుగానే లెక్కిస్తున్నారు. ఆంధ్రాలో భాజపాకి రాజకీయ ప్రయోజనాలు ఏవీ లేవు కాబట్టి.. ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమైనా ఫర్వాలేదన్నట్టుగా అమిత్ షా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అంటే, ఈ క్రమంలో ఒక రాష్ట్రం నిర్లక్ష్యానికి గురౌతోందనో, లేదా అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమకి ఉంటుందన్న విషయం అమిత్ షాకు గుర్తున్నట్టు లేదు. తమకు ఎంపీ సీట్లు ఎక్కడ వస్తాయంటే, అక్కడే భాజపా శ్రద్ధ పెడుతుందని చెప్తున్నారు. ఆంధ్రా విషయమై అమిత్ షా లెక్క ఇంత స్పష్టంగా ఉంది. ఇక, ఎన్ని ఉద్యమాలు చేసినా భాజపాలో కదలిక వచ్చే అవకాశం ఉంటుందా..?