‘సూపర్ స్టార్…’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకోగలిగే అర్హత ఉన్న నటుడు, కథానాయకుడు మహేష్ బాబు. ఆ నవ్వుకి అభిమనులంతా దాసోహం అయిపోతారు. ఆ నడక, ఆ పరుగు.. ఓ సెపరేట్ స్టైల్. మహేష్ ఓ హిట్టు కొడితే… ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు సినిమాలు రుజువు చేశాయి. అయితే ఇప్పుడు మహేష్ ఫామ్ కాస్త దారి తప్పింది. వరుసగా రెండు పరాజయాలు తగిలాయి. దాన్నుంచి తేరుకుని ‘భరత్ అనే నేను’తో మరోసారి అభిమానుల్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా మహేష్ తో చిట్ చాట్ ఇది.
* ఇటీవల ఎదుర్కున్న పరాజయాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఆలోచనతో ఈ సినిమా చేశారా?
– ఏ సినిమాకైనా ఒకేలా పనిచేస్తాం. ప్రతీ సినిమా హిట్టవాలని కోరుకుంటాం. కానీ అన్నిసార్లూ అది జరగదు. భరత్ అనే నేను విషయంలో మాత్రం నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఇది వరకు ఏ సినిమాకీ లేనంత ధీమా ఈ సినిమాకొచ్చింది. సాధారణంగా నేను సినిమా విడుదలయ్యాక విహార యాత్రకు వెళ్తుంటారు. ఈసారి ముందే వెళ్లొచ్చేశా. ఈ సినిమా అందించిన నమ్మకం అది.
* ఈ సినిమా కోసం సీ ఎం అయిపోయారు.. ఆ పదవి గురించి మీకున్న ఆలోచనలేంటి?
– సీఎమ్ అంటే పెద్ద కాన్వాయ్.. భారీ హడావుడి అనుకుంటారు. కానీ.. ఓ రాష్ట్రాన్ని కాపాడే ఉద్యోగం అది. చాలా బాధ్యతతో చేయాలి.
* రాజకీయాలంటే పెద్దగా పడదు అని చెబుతుంటారు. అలాంటి మీరు ఈ కథ ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
– కథే. యేడాది క్రితం కొరటాల శివ ఈ కథ వినిపించారు. వినగానే నచ్చింది. దాంతో పాటు భయం కూడా వేసింది. రాజకీయాలకు నాకూ ఎలాంటి సంబంధం లేదు కదా, ఈ పాత్రని చేయగలనా అనిపించింది. కానీ కొరటాల శివ ఆలోచనలు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు ఓకే చేశా.
* ఈ సినిమా చేశాక రాజకీయాలపై అభిప్రాయం మారిందా? రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా కలిగిందా?
– నాకు సినిమాలంటేనే ప్రాణం. సినిమాల్లోనే ఉంటా. రాజకీయాల గురించి నాకేం తెలీదు. కాకపోతే కాస్త అవగాహన మాత్రం పెంచుకున్నా.
* ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఏమైనా ఉంటాయా?
– అవేం ఉండదు. కథలో నిజాయతే ఈ సినిమాని నడిపిస్తుంది. ఓ మంచి విషయాన్ని కమర్షియల్ హంగులతో చెప్పడం కొరటాల స్టైల్.అది ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి డాన్సులు చేయడమేంటి? ఫైట్లు చేయడం ఏమిటి? అని ప్రేక్షకులు ఫీలయ్యే ప్రమాదం ఉంది. కానీ వాటిని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు.
* ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తేం చేశారా? సెట్లో సవాల్ అనిపించిన విషయాలేంటి?
– ప్రత్యేకమైన కసరత్తులేం లేవు. కానీ డైలాగులు చెప్పడం కష్టం అనిపించింది. ఈ సినిమాలో పేజీల కొద్దీ డైలాగులు పలికించారు కొరటాల. వాటిని ముందే ప్రిపేర్ అయి సెట్‌కి వచ్చేవాడ్ని.
* భరత్ అనే నేను.. అనే డైలాగ్ వింటుంటే… కృష్ణగారి గొంతులానే అనిపించింది…
– చాలామంది నాన్నగారి గొంతే అక్కడ పెట్టాం అనుకున్నారు. కానీ అది నా గొంతే. నాకూ.. అదే ఫీలింగ్ కలిగింది. నా గొంతు నాన్నగారి గొంతులా ఉందేంటి? అని కొరటాలని కూడా అడిగా.. (నవ్వుతూ)
* ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘ఈనాడు’ లాంటి సినిమాలేమైనా చూశారా?
– నాన్నగారి సినిమాల్లో నాకు ఈనాడు చాలా ఇష్టమైన చిత్రం. దాన్ని ఓ 20 సార్లు చూసుంటా. అందులో నాన్నగారు సంభాషణలు పలికే విధానం చాలా బాగుంటుంది. అల్లూరి సీతారామరాజులో కూడా భారీ డైలాగుల్ని పలికారు. ఈ సినిమాలో నా పాత్రపై ఆయన ప్రభావం చాలా ఉంది.
* ఈ సినిమా ప్రజల్లో మార్పు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా?
– సినిమా అనేది వినోదం. అది మాత్రం ఈ సినిమా తప్పకుండా అందిస్తుంది. సినిమా చూసొచ్చాక కూడా మాట్లాడుకుంటే మంచిదే. రాజకీయాలంటే ఆసక్తి, ఓ అభిప్రాయం ఉన్నవాళ్లందరికీ భరత్ అనే నేను తప్పకుండా నచ్చుతుంది. అయితే సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేను.
* హీరోలం మేం బాగానే ఉన్నాం.. మీరే మారాలి అని అభిమానుల్ని ఉద్దేశించి ఓ మాట అన్నారు. అభిమానుల్లోంచి ఎలాంటి మార్పుని కోరుకుంటున్నారు?
– ఓ హీరో సినిమా విడుదలైతే, మిగిలిన హీరోల అభిమానులు దాన్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సినిమాకి మంచిది కాదు. అలాంటి అభిమానులంతా మారాల్సిన అవసరం ఉంది.
* భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వచ్చారు. మీరే ఆహ్వానించారట కదా?
– ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అందరూ అనుకున్నాం. మేం అడగ్గానే తను వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఇక మీదట ఇదే ట్రెండ్ టాలీవుడ్లో కొనసాగుతుంది.
* ప్రయోగాలు చేయాలంటే మహేషే చేయాలని ఎన్టీఆర్ చెప్పారు.. ఇక మీదటా ప్రయోగాలు చేస్తూనే ఉంటారా?
– లేదండీ. ప్రయోగాలు చేసీ చేసీ అలసిపోయా. ఇక మీదట కూడా చేస్తే నాన్నగారి అభిమానులు ఇంటికొచ్చి మరీ కొడతారు (నవ్వుతూ). ఇక మీదట కమర్షియల్ సినిమాలు చేస్తా.