శ్రీరెడ్డి ఉదంతంలో, కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో రోజుకొకరు మాట్లాడడం మొదలెట్టారు. మొన్న జీవిత, నిన్న నాగబాబు.
జీవిత స్పీచ్ ఎంత హైలెట్ అయ్యిందో, ఇప్పుడు నాగబాబు పీకిన క్లాసు కూడా అంతే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మెగా ఫ్యాన్స్‌కి నాగబాబు రాకతో హుషారొచ్చింది. కాకపోతే నాగబాబు టైటింగ్ రాంగా, రైటా? అనేదే పెద్ద ప్రశ్న. పవన్‌పై శ్రీరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలోనే నాగబాబు ఎంట్రీ ఇచ్చాడన్నది వాస్తవం. ఆ విషయం ప్రస్తావిస్తున్నప్పుడు నాగబాబు కళ్లలో కనిపించిన ఫైర్ అంతా ఇంతా కాదు. తమ్ముడ్ని టార్గెట్ చేయొద్దని, మెగా హీరోల్ని అంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే శ్రీరెడ్డి తన తప్పుకి క్షమాపణ అడిగిన తరవాత.. నాగబాబు ఎంట్రీ ఇవ్వడం రాంగ్ టైమింగే. పైగా.. శ్రీరెడ్డి అప్పటికే దాదాపుగా తన ఓటమి అంగీకరించేసింది. ఈ ఇష్యూని అక్కడితో పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే శ్రీరెడ్డి డల్ అయ్యిందో.. అప్పుడు గొంతులు ఎక్కువగా లేవడం మొదలెట్టాయి. ఓరకంగా శ్రీరెడ్డిపై `పడిపోయిన` సానుభూతిని లేపడానికి తప్ప ఇంకేం అక్కరకు రావు.
కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం నెల రోజుల నుంచి నడుస్తూనే ఉంది. అప్పుడు మాట్లాడని నాగబాబు.. ఇప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చాడు. అతను `మా`లో ఇప్పుడు యాక్టివ్ పార్ట్ కాదు. సినిమాలూ తీయడం లేదు. అంటే కేవలం తమ్ముడ్ని అన్నందుకు రంగంలోకి దిగాడన్నమాట. బాల్ తన కోర్టులో, తన కుటుంబంలో పడినప్పుడు మాత్రమే స్పందించడం వ్యక్తిగా, వ్యవస్థని నమ్ముకున్న పెద్ద మనిషిగా కరెక్ట్ కాదు. `ఈ సమస్యని పరిష్కరించడానికి నేను చాలు` అని నాగబాబు చాలా సింపుల్‌గా అనేశాడు. అదే నిజమైతే… ఈ వ్యవహారం ఇంతగా ముదరకుండానే అడుగుపెట్టాల్సింది. పరిష్కారం చాలా ఈజీ.. అని చెప్పిన నాగబాబు ఆ పరిష్కార మార్గం ఏమిటో చెప్పడం మర్చిపోయాడు. తన తమ్ముడ్ని కార్నర్ చేయొద్దని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. పనిలో పనిగా.. మెగా ఫ్యాన్స్‌ని శ్రీరెడ్డిపై ఉసిగొల్పడానికి కూడా దోహద పడింది. మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలా మాట్లాడకపోతే శ్రీరెడ్డిలాంటివాళ్లని కంట్రోల్ చేయడం కష్టమని కొంతమంది ఫ్యాన్స్ వాదన. అది కూడా నిజమే. మెగా హీరోలంతా కామ్‌గా కూర్చుంటే… ఈ చర్చకు, రచ్చకు అడ్డుకట్ట పడేదెప్పుడు? ఈ విషయంలో నాగబాబు కొంత సక్సెస్ అయ్యాడు. కాకపోతే… ఇంకాస్త తొందరగా మేల్కొని ఉంటే.. ఈ అపవాదు కూడా ఉండేది కాదు.