మెగా కాంపౌండ్ అంతా ఒక్కటే. కానీ కుటుంబాల మధ్య అడ్డుగోడలున్నాయి. వ్యక్తుల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండో తరం, మూడో తరం లైన్లోకి వస్తున్న కొద్దీ ఈ గ్యాప్ పెరిగిపోయింది. చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ఈ గ్యాప్ ను పెంచేశారు. రామ్ చరణ్ ను దాటేసి వెళ్లిపోతున్నాడని..అల్లు అర్జున్ పై .. ఓ రకమైన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఆ ఫ్యామిలీలో రౌండ్లు కొట్టింది. ఇక ముందు నుంచీ పవన్ కల్యాణ్ కు.. అల్లు అరవింద్ తో సన్నిహిత సంబంధాలు లేవు. పవన్ వారితో కలసిన సందర్భం కూడా పెద్దగా లేదు. కానీ శ్రీరెడ్డి పుణ్యమా అని అంతా ఏకమయ్యారని..మెగా ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
గతంలో ఎప్పుడైనా పవన్ కల్యాణ్ కు మద్దతుగా అరవింద్ ..బ్యాటింగ్ కు రావడం చూశామా..? పోనీ తన తరుపున మాట్లాడని.. అరవింద్ కు పవన్ కల్యాణ్ ఎప్పుడైనా స్వేచ్చ ఇచ్చారా..? పైగా జనసేనకు వకాల్తాగా మాట్లాడటం పవన్ కు తెలియకుండా జరుగుతుందా..? చాన్సే లేదు.. కానీ అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అంతకు ముందురోజే ఓ సినిమా ఫంక్షన్ లో శ్రీరెడ్డి ఇష్యూపై తన అభిప్రాయాలను పొడిపొడిగా చెప్పిన అరవింద్..అంతటితో ముగించేశారు. కానీ తర్వాతి రోజే.. మళ్లీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో పవన్ కల్యాణ్ పై కుట్ర జరుగుతోందని..అదీ రాజకీయ నేపధ్యమేనని..తన అనుభవంతో అందర్నీ నమ్మించేలా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు టాలీవుడ్ లో ఎలాంటి ఇష్యూ వచ్చినా పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి ఆగుతోంది. పవన్ పాలిటిక్స్ లోకి రావడమో…లేక…సాఫ్ట్ టార్గెట్ గా మారితే పబ్లిసిటీ దొరకడమో కారణం కావొచ్చు. ఇలాంటి వాటిని చెక్ పెట్టాలంటే.. కచ్చితంగా అరవింద్ మాస్టర్ ప్లాన్లు అవసరమేనని మెగా ఫ్యామిలీ గుర్తించింది. అందుకే ఏకగ్రీవంగా అందరూ మాట్లాడుకుని… అరవింద్ ను ముందుకు పంపారు. ఆ బాధ్యతను అరవింద్ సంతోషంగానే స్వీకరించారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారు. లేకపోతే… పవన్ తరుపున మీడియా ముందుకు వచ్చేందుకు అరవింద్ ఒప్పుకునే అవకాశం లేదు.
మెగా కాంపౌండ్ లో అడ్డు తెరలు తొలగిపోతే… జనసేన విషయంలోనూ… అందరూ తెరముందుకు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా శ్రీరెడ్డి ఏ ఉద్దేశంతో పవన్ కల్యాణ్ పై డైరక్ట్ ఎటాక్ చేసిందో కానీ.. చివరికి అది మెగా ఫ్యామిలీకే ఉపయోగపడిందని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.