నంది అవార్డుల వివాదం వచ్చినప్పుడు.. కొద్ది రోజుల క్రితం మెగా కాంపౌండ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఓ కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇండస్ట్రీ అంటే మెగా ఫ్యామిలీనే అనేలా…. ఇండస్ట్రీకి వస్తున్న ఆదాయంలో 60శాతం.. మెగా హీరోల నుంచే వస్తోందని ప్రకటించారు. అయినా తమను కించ పరుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ పరిణామాల తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నిరసన ప్రారంభించింది. శ్రీరెడ్డి అనే నటీమణి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సంక్షోభానికి కారణం.
తన తల్లిని కించ పరిచారంటూ.. పవన్ కల్యాణ్ అర్థరాత్రి నుంచి ట్వీట్లు పెట్టారు. తెల్లవారగానే… సోదరుడు నాగబాబుతో ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు. అంతే.. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కో హీరో… ఒక్కో ప్రొడ్యూసర్ రావడం ప్రారంభించారు. ఇండస్ట్రీలో తమ ప్రతిభ చూపిన ప్రతి మెగా ఫ్యామిలీలోని వ్యక్తి చాంబర్ కు వస్తున్నారు. చివరిగా చిరంజీవి కూడా వస్తారు. మా కార్యవర్గం కూడా హుటాహహుటిన సమావేశం అవుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇండస్ట్రీలో తామేంటో బలప్రదర్శన చేయడం మెగా ఫ్యామిలీ లక్ష్యం అయి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… శ్రీరెడ్డి ఇష్యూలో.. వేరే కుటుంబం పరువు కాపాడటానికి తమ మీద బురద జల్లుతున్నారని అరవింద్ ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాము ఏ మాత్రం బలహీనంగా లేమని.. నిరూపించేందుకు మెగా ఫ్యామిలీ సమైక్యంగా .. ఫిల్మ్ చాంబర్ వేదికగా బలప్రదర్శనకు దిగింది. సహజంగా మెగా ఫ్యామిలీకి సపోర్ట్..ఇండస్ట్రీలోని ఇరవై నాలుగు క్రాఫ్టుల్లో పనిచేసే వారంతా.. ఎలాగూ వస్తారు. కాబట్టి బలప్రదర్శన.. ఒక్క ఫ్యామిలీకే పరిమితం కాదు.. తమ బలం.. ఇండస్ట్రీ మొత్తం వ్యాపించిందని నిరూపించబోతున్నట్లు తెలుస్తోంది.