తీగలాగితే డొంకంతా కదులుతుందన్నట్టు పవన్ కళ్యాణ్‌పై దుమారం లేవదీయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి మీడియా రాజకీయాల డొంక కదిలింది. పవన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏదో జరగబోతుందని నేను ఏప్రిల్ 15న ట్వీట్ చేస్తే విస్తారమైన ప్రతిస్పందన వచ్చింది. అయితే తర్వాత అది మరింత అసహ్యకరమైన రూపం తీసుకుంది. అల్గుటయే ఎరుంగని అన్నట్టు ఇంతకాలం మౌనంగా వుండి ఒక్కసారిగా ఆయన ముఖ్యమంత్రి కుమారుడైన లోకేశ్‌పైన, టీవీ9 ఛానల్ రవిప్రకాశ్ శ్రీనిరాజులు కలసి ఎపి సచివాలయంలోనే కుట్ర పన్నారని ఆరోపించడం అనూహ్యమైన అసాధారణ పరిణామం. సమస్య కూడా అంతే దారుణమైంది గనక తర్వాత ఫిలిం చాంబర్ దగ్గర కూడా నిరసన వినిపించి వచ్చారు. ఎబిఎన్రాధాకృష్ణ, మహాటీవీ మూర్తి వంటివారిపై తర్వాత ట్వీట్లు జోడించారు. ఆయా సంస్థల యాజమాన్యాల వివరాలు షేర్లు కూడా పెట్టారు. నిజానికి మామూలుగా అయితే పవర్ స్టార్ మరెవరిమీదైనా ే ఇంతటి తిరుగుబాటు చేయడం ఇదే ఛానళ్లలో మోతమోగి వుండేది. కాని ఇప్పుడంతా నిశ్శబ్దమే. అల్లు అరవింద్, నాగబాబు వంటివారిఆగ్రహావేదనలను మించి పవన్ విశ్వరూపం చూపించారని చెప్పాలి. ఆ స్థాయి హీరో అంత ప్రముఖ సంస్థలపై కుట్ర చేసినట్టు అధికారికంగా చెప్పడం ఇదివరకెన్నడూ జరగలేదు.
తెలుగు 360 పాఠకులకు ఈ కుట్ర సంగతి కొత్తదేమీ కాదు. గతం వారంలోనూ నా కాలమ్‌లోనూ ఇతరత్రా కూడా ఈఅంశాన్ని సృశించడం చూస్తూనే వున్నారు. మర్యాద కోసం ఆగడం తప్ప మరిన్ని విషయాలు పంచుకోవడానికి కూడా అవకాశముండేది. అయితే ఈ రామ్‌గోపాల్ వర్మ వీడియో, శ్రీరెడ్డి సంభాషణల లీకుల తర్వాత పరిస్థితి మరింత అసహ్యంగా తయారైంది. ఎలాగూ దొరికిపోయే పరిస్థితిలో చా.తె(చావు తెలివి) వ్యవహారంలాగా ఆయన తనే కొన్ని విషయాలు బయిటపెట్టారు. ఇందులో అయిదుకోట్టు ఇస్తాననే మాట పట్టుకుని ఇది వైసీపీ చేయించినట్టు ఎబిఎన్ ఛానల్ బ్యూరో చీఫ్ చెప్పడం నేను విన్నాను. అప్పటికీ సాక్షి స్పందించడం లేదు. ఈ రోజు ఉదయం పవన్ ట్వీట్ల తర్వాతనే కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ చేపట్టారు.మామూలుగా ఆ ఛానల్లో పవన్ గురించి మరీ ఎక్కువగా గాని అనుకూలంగా గాని పెద్దచర్చ జరగదు. అయితే ఇప్పుడు ఆయన తమకు రాజకీయ ప్రత్యర్తులుగా వున్న ఛానల్పైకూడా ఆరోపణ చేయడమే గాక సచివాలయం లోకేశ్ వంటి ప్రస్తావనలు చేశారు గనక సాక్షి వివరంగా కవరేజిచేపట్టింది. మిగిలిన రెండు ఛానళ్లు మొక్కుబడిగా ఇవ్వడం తప్ప ప్రచారమిచ్చే అవకాశం ఎలానూ వుండదు. మొత్తంపైన ఇది పెద్ద సంచలనంగానే మారింది. సినీ పరిశ్రమ క్యాస్టింగ్ కౌచ్ సమస్య కాస్త కాన్సిర్పసీ టీమ్‌గా మారిపోయింది.
చిత్ర పరిశ్రమ గాని మా గాని మొదట మౌనంగా వుండి తర్వాత స్పందించాయి. అలాగే మలి దశలో జీవిత, హేమ వంటి తారలు వ్యక్తిగత ఆరోపణలకు సమాధానమిస్తూ మీడియాపై దాడి చేశారు. ఆ మరురోజు వర్మ, శ్రీరెడ్డి కొత్త కథనాలు రావడంతో మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఈ విషయంలో పవన్‌పై అనవసరంగా వ్యాఖ్యలు చేశారనే భావం అందరిలో వుంది. అది కూడా వర్మ చెప్పి చేయించాడని ఆమె ఆయన కూడా వెల్లడించడంతో కథ అడ్డం తిరిగింది. పవన్ గాయపరిచినట్టు ఆయన ట్వీట్లలో భాషే చెబుతుంది. ఇన్నిరోజులు ఈ విషయం సాగదీయడంలో గాని, ఎప్పటికప్పుడు ఏదో ట్విస్టుతో టిఆర్పి పెంచుకోవడంగాని ఛానళ్లపై ఎన్నడూ లేనంత జుగుప్స కలిగించింది. మహిళా సంఘాల జోక్యం వల్ల హక్కుల రక్షణ అవకాశాలు భద్రత వంటి అంశాలు ముందుకు వచ్చాయి.కాని సమస్య రేకెత్తించిన వారి లక్ష్యం అది కాదు. పవన్ కళ్యాణ్‌తో సహా కొందరు వ్యక్తులపై దాడి చేయడం. పరిశ్రమలో అనారోగ్యకరమైన కులతత్వాలను తీసుకురావడం.పాలక పార్టీలకు చేయగలిగిన మేలు చేయడం.
శ్రీరెడ్డి మొదట దారుణమైన పదాలు భాష ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలపై కేంద్రీకరించవలసిందిగా ఈ బడా ఛానళ్లు సూచించింది లేదు. పైగా ఇంకా ఇంకా గుచ్చి గుచ్చి అడుగుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.అవమానాలకూ ఆశాభంగానికి గురైన ఆమెకు తెలియకపోయినా ఛానళ్లకు బాగా తెలుసు- ఇది వారం రోజుల హడావుడి మాత్రమేనని. ఆ తర్వాత ఎంత గొప్ప వారొచ్చి ఏం చెప్పినా చూడరు. చల్లారే మంట ఎగదోసినట్టు చప్పబడిపోయే ఈ ఎపిసోడ్‌ను సాగదీయడానికి రకరకాల ఎత్తులు నడిచాయి.పూనమ్ కౌర్ అనే సినీ నటి కూడా మధ్యలో వచ్చారు. అయితే ఆమె ఆశించినంత మసాలా అందివ్వడానికి సిద్ధపడకపోవడంతో మళ్లీ శ్రీరెడ్డితోనే మాట్లాడించారు. అక్కడి నుంచి ఈ నాటకంలో బూటకత్వం బయిటకు రావడం మొదలైంది. ఎందుకంటే తర్వాత ఏం చెప్పాలో ఎలా సాగదీయాలో తెలియలేదు. అప్పుడు దయ్యం దర్శకుడు వర్మ పవన్ వంటి వారిని అనమని పురికొల్పాడన్నమాట. ఎలాగూ ఆమె తన పేరు చెబుతున్నట్లు తెలిసి ఆయన బయిటకొచ్చాడనేది స్పష్టం. అయితే ఆయనతోనే ఈ కథ ఆగలేదన్నది పవన్ చెబుతున్న మాట. నాగబాబు అల్లుఅరవింద్ వంటివారు వర్మను లక్ష్యంగా చేసుకున్నారు గాని పవన్ ఏకంగా ఏనుగు కుంభస్థలంపైకే లంఘించారు. అమ్మను తిట్టారనే బాధతో పాటు కుట్రపూరితమైన కథనాలు ఆయనను బాగా బాధపెట్టినట్టు అర్థమవుతూనే వుంది. ఇందులో ఎవరి పాత్ర ఎప్పుడు ఎంత అనేది చర్చ తప్ప ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందనేది నిజం.
అంతటి ప్రముఖుడు చేసిన ఈ ఆరోపణలపై స్పందించకుండా తెలుగుదేశం మౌనం దాల్చడం అర్ధాంగీకారమే. రేపు ఎప్పుడో వచ్చి తీవ్రంగా దాడి చేయొచ్చు గాని ఇప్పటికే ప్రజలు కుట్ర జరిగిందని నిర్థారణకు వచ్చేశారు. అంతపెద్దవారిపైనే కుట్ర పన్ని కట్టుకథలు నడిపేవారు రాజకీయాల్లో మరెంత రాక్షసంగా వుంటారోనని సందేహాలు అలుమకున్నాయి. అనివార్యంగా వెంటాడే కులం నీడలు కమ్ముకున్నాయి.పరిశ్రమలో రెండు మూడు వర్గాలుగా ఆలోచించే వాతావరణం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే మండిపడే వైసీపీ అనుకూల సంస్థలు కూడా ఆయనకు విస్త్రతమైన ప్రచారమివ్వక తప్పని స్థితి ఏర్పడింది. ఇదంతా మీడియా స్వయంకృతాపరాధం. సినిమా రంగపు కాలుష్య ఫలితం.అన్నిటినీ మించి నీతిమాలిన రాజకీయాల విషవలయం. దీన్ని ఛేదించవలసిందే గాని మీడియాపై దాడిగా మారకుండా చూడవలసి వుంది.ఈ రోజు జరిగిన విధ్వంసం వంటిది మళ్లీ పునరావృతం కాకుండా పవన్ జాగ్రత్త వహిస్తారని ఆశించాలి.
చివరగా ఒక్క మాట -లోకేశ్ పేరు ఇలాటి వాటిలో చిక్కుకోకుండా చూసుకోవలసిన బాద్యత చంద్రబాబుపై వుంది. ఎందుకంటే ఇలాటి దుస్సలహా దారులకు ఎప్పుడైనా ఎవరైనా బలి అయ్యే ప్రమాదం వుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని సంగతులు తర్వాత చెప్పుకుందాం.
తెలకపల్లి వ్యూస్