దేశంపై పెత్తనం చేయడమే కాదు, రాష్ట్రాలపై బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని భాజపా సర్కారు తీరుతోపాటు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైకాపా, జనసేన పార్టీలపై విమర్శలు చేశారు. కేంద్రంతో పోరాటం ఇంతకుముందే చెయ్యొచ్చు కదా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కానీ, సరైన సమయంలో సరైన పని చేయాలన్నారు. మొదట్నుంచీ కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే పోతే, గొడవలకే సమయం సరిపోతుంది తప్ప, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టే సమయం లేకుండా పోతుందన్నారు.
ప్రత్యేక హోదా అంశమై తాను ఎప్పుడూ రాజీపడలేదన్నారు. ఇస్తామని చెబుతూ ఉంటే వేచి చూశామన్నారు. సామ దాన భేద దండోపాయాలని మన పెద్దలు చెబుతారనీ, అలాగే కేంద్రం విషయంలో ఒక్కో దశలో రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టే మార్గాన్వేషణ చేశానన్నారు. మిత్రపక్షంగా ఉంటూ ప్రయత్నించాననీ, అప్పటికీ కుదరకపోతే ఎప్పటికిప్పుడు ఢిల్లీకి వెళ్లాననీ, అప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే భాజపాతో తెగతెంపులు చేసుకుని పోరాటానికి దిగామన్నారు. మనం పోరాటానికి దిగేసరికి కేంద్ర వైఖరి మారిందనీ, రాష్ట్రానికి వచ్చిన నిధుల్ని కూడా వెనక్కి లాక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. వెనకబడిన ప్రాంతాల కోసం ఇచ్చిన రూ. 350 కోట్ల నిధులనూ, ఆర్బీఐ ద్వారా మళ్లీ వెనక్కి తీసుకున్నారన్నారు.
ఎన్డీయే నుంచి చంద్రబాబు వెళ్లిపోతారని ముందే తెలిస్తే ఈమాత్రం సాయమూ చేసేవాళ్లం కాదని భాజపా నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అయినా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఆపడానికి.. ఇది ఎవరి సొమ్ము..? ప్రజలు సొమ్ము కాదా అనీ, పన్నుల ద్వారా చెల్లించింది కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రమ్మీద కేంద్రం కక్ష కట్టిందనీ, రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి రావొచ్చనీ, ఇక్కడున్న కొంతమంది మద్దతుతో ఏదో చేయాలని కేంద్రం చూస్తోందనీ, అలాంటి లాలూచీ రాజకీయాలు ఇక్కడ సాగవన్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశమై పోరాటం చేసి తీరతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విపక్షాలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయనీ, ప్రతీవారం కోర్టు వెళ్తూ మోడీ ఏదో చేసేస్తారని భయపడుతున్నది వారే అని విమర్శించారు. జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ… ఆయన మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఏంటో ప్రజలు గమనించాలని కోరారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడా బూతు మాట మాట్లాడలేదనీ, విలువలతో రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. హోదా కోసం మంత్రులు రాజీనామా చెయ్యరా, ఎన్డీయేలో నుంచి బయటకి వస్తే మద్దతు ఇస్తాం, ప్రధానమంత్రి ఇంటి ముందు దీక్ష చెయ్యరా.. అంటూ తమని ప్రశ్నించారనీ, ఇవన్నీ చేస్తే వారు ఎందుకు తమతో కలిసి రావడం లేదని ప్రశ్నించారు. ప్రజల దీవెనతో తాను ముందుకు సాగుతానని, పోరాటం కొనసాగిస్తానని చంద్రబాబు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు తన జీవితాశయమనీ, నిర్మించి తీరతా అన్నారు. దీంతోపాటు కరెన్సీ కష్టాలనూ, కతువా కేసు గురించీ, విశాఖ రైల్వేజోన్, కేంద్రం ఇచ్చామని చెప్పుకుంటున్న విద్యా సంస్థల పరిస్థితి, అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన అరకొర నిధులు, కడప ఉక్కు పరిశ్రమ… ఇలా దాదాపు అన్ని అంశాలను చంద్రబాబు ప్రస్థావించారు.