పార్లమెంట్ ను ప్రతిపక్షాలు నడవనీయలేదంటూ… ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఒక రోజు దీక్ష చేశారు. నిజానికి ఓ ప్రధానమంత్రి విపక్షాలకు వ్యతిరేకంగా దీక్ష చేయడమనే కాన్సెప్ట్ కొత్తది. అందుకే మీడియాతో పాటు ప్రజలు కూడా ఆసక్తి చూపించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దీక్షను తూ.తూ మంత్రంగా చేశారు. అసలు చేశారో లేదో కూడా తెలియదు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్లో టీ, టిఫినీలు, డిన్నర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో విమర్శలొచ్చాయి. కేంద్రం తీరుకు నిరసనగా చంద్రబాబు కూడా దీక్ష అనేసరికి.. అందరూ మోదీ దీక్షతో పోల్చడం ప్రారంభించారు. ఇదీ కూడా అలాంటిదే అనుకున్నారు. అదే సమయంలో.. జగన్ తరచూ చేసే దీక్షలు కూడా సమీక్షకు వచ్చాయి. జగన్ రెండు రోజుల దీక్ష పేరుతో..ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకూ దీక్షా వేదికపై కూర్చుని వెళ్లిపోయేవారు.
ఈ అనుభవాలతో ముఖ్యమంత్రి అత్యంత బిజీషెడ్యూల్ మధ్య…అదీ పుట్టిన రోజు నాడు.. పన్నెండు గంటల దీక్ష చేయడం అసాధ్యం అనుకున్నారు. కానీ చంద్రబాబు .. కచ్చితంగా ఏడు గంటలు అనగానే… ఏడు గంటకల్లా దీక్ష ప్రారంభించారు. సాయంత్రం ఏడు గంటల వరకు కదల్లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ముట్టకుండా తన ధర్మ పోరాట దీక్షపై చిత్తశుద్ధి చూపించారు. దీంతో ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. మొదట్లో తేలిగ్గా తీసుకున్న వారే.. తర్వాత ..చంద్రబాబును శభాష్ అన్నారు. చంద్రబాబు పట్టుదలకు నిదర్శనం అని పొగడ్తల వర్షం కురిపించారు.
ఇక ప్రసంగం విషయంలోనూ చంద్రబాబు అదుర్స్ అనిపించారు. కొత్త విషయాలేమీ చెప్పలేదు. అన్నీ గతంలో చెప్పినవే. అయినా చంద్రబాబు.. కేంద్రంపై తన పోరాట సంకల్పాన్ని ప్రభావ వంతంగా ప్రజల ముందు ఉంచారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలు.. ప్రజలకు ఎలా ద్రోహం చేస్తున్నాయో వివరించారు. అంతుక మించి ఏపీ ప్రయోజనాలను వారు ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో ప్రజలకు వివరించగలిగారు. తన పోరాట ప్రణాళిక..తన లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
పకడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు దీక్షకు… 175 నియోజకవర్గాల్లోనూ.. సంఘీభావదీక్షలుకూడా… అంతే సిన్సియర్ గా జరగడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఏ రాజకీయ పార్టీ.. ఏ ఉద్యమం చేసిన అది రాజకీయమే. అయితే.. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటే ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. తాము రాజకీయంతో పాటు.. రాష్ట్ర ప్రయోజనాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రజలకు చంద్రబాబు ఇన్ డైరక్ట్ గా దీక్ష ద్వారా సంకేతం పంపారు. ఓ విధంగా ఆమోదం కూడా పొందారన్నది టీడీపీ అభిప్రాయం.