పవన్ కళ్యాణ్ నిన్న టీవీ ఛానల్స్ పైన విరుచుకు పడటం తెలిసిందే. టీవీ9 శ్రీనిరాజు, టీవీ9 రవి ప్రకాష్, రాంగోపాల్ వర్మ, లోకేష్ స్నేహితుడు రాజేష్ కిలారు మరియు లోకేష్ కలిసి తనపై 10 కోట్లు వెచ్చించి కుట్రపన్నారని మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసి, తన పార్టీ అవకాశాలను దెబ్బ తీసే కుట్ర ఇందులో ఉందని ఆరోపణలు చేశారు. ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నిజంగా ఆధారాలున్నాయా? కొన్ని మీడియా ఛానల్ చర్చల్లో ఈ ఆధారాలు గురించి ఏం చెప్పారో చూద్దాం. అయితే దానికి ముందు ఆరోపణలు రాజకీయాల్లో ఆరోపణ వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుందో చూద్దాం
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి- చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అన్నారని ఆరోపణలు చేశాడు. నిజానికి ఈ ఆరోపణలకు ఎక్కడా ఆధారాలు చూపలేకపోయాడు. కానీ దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ చంద్రబాబుకు జరిగిపోయింది. అలాగే టిడిపి వర్గాలు జగన్ లక్ష కోట్లు తిన్నాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటాయి. సీబీఐ అధికారికంగా ఆరోపించిన మొత్తం ఈ లక్ష కోట్ల కంటే చాలా చాలా తక్కువ అయినప్పటికీ ప్రజల్లో జగన్ లక్ష కోట్లు తిన్నాడు అన్న ఆరోపణ బలంగా ముద్రించుకుపోయింది. ఇప్పటికీ జగన్ కి గ్రామీణ ప్రాంతంలో పడ్డట్టుగాపట్టణాల్లోనూ నగరాల్లోనూ ఓట్లు పడకపోవడానికి ఇది ప్రధాన కారణం. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఆరోపణలు చేసే వారు. దీన్ని ఖండిస్తూ ఎవరు ఎన్ని ఆధారాలు చూపినప్పటికీ ప్రజలకు ఎక్కలేదు. కేసీఆర్ చేసిన ఆరోపణ వాళ్లు నమ్మారు ఈ మూడు సంఘటనలలో ఒక కామన్ అంశం ఉంది అదేంటంటే ఆయా నాయకులు ఆరోపణలు చేసినప్పుడు అవి ఆధారాలు లేనప్పటికీ ప్రజల్ని నమ్మించగలిగే లా ఉన్నాయి. చంద్రబాబు వ్యవసాయాన్ని తన పాలనలో పూర్తిగా పక్కన పెట్టడంతో ప్రజలు వైయస్ ఆరోపణల్ని నమ్మారు. జగన్ లక్ష కోట్లు తినకపోయినా ఎంతోకొంత తిన్నాడు అన్నట్టుగా కళ్లముందు కనిపించడంతో టిడిపి ఆరోపణలు ప్రజలు నమ్మారు. అలాగే తెలంగాణ వెనుకబాటుతనం కళ్లముందు కనిపిస్తుండటంతో ప్రజలు కెసిఆర్ ఆరోపణలు నమ్మారు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు కూడా ఆధారాలు లేనప్పటికీ ప్రజలు ఎంతో కొంత నమ్మడానికి కారణం టీవీ ఛానల్ చానళ్లు వ్యవహరించిన తీరే ఎక్కడో సమస్యను మొదలుపెట్టి దానికి ఎటువంటి సంబంధమూ లేని పవన్ కళ్యాణ్ ని అందులోకి లాగి పవన్ ని తిట్టించడమే కాకుండా వాళ్ల తల్లిని కూడా దూషించడం- ప్రజలు ఈ ఆరోపణలని నమ్మడానికి కారణమైంది . దీంతోపాటు ప్రజారాజ్యం సమయంలో ఈ చానళ్లు వ్యవహరించిన తీరు కూడా ప్రజలకు గుర్తుండడంతో ఈ ఆరోపణలు ప్రజలు నమ్మేలా చేయడం పవన్ కళ్యాణ్ కి సులువయింది
అయితే ఆధారాలు ఉన్నాయా లేవా అన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేదు గతంలో లోకేష్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట మార్చడం తో ఇప్పుడు కూడా అలాగే ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. అయితే సాక్షి చానల్లో మాత్రం నిన్నటి చర్చలో పవన్ కళ్యాణ్ దగ్గర లోకేష్ మిత్రుడు, రాజేష్ కి సంబంధించిన ఒక ఆడియో టేప్ ఉన్నట్టు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఆ ఆధారం వల్లే పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళుతున్నాడని అన్నారు. అయితే ఈ విషయం మీద మరింత స్పష్టత రావాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించారు
ఇప్పటికైతే ఆధారాలు చూపినా చూపకపోయినా ప్రజలు నమ్మేలా చేయగలగడం లో పవన్ కళ్యాణ్ విజయవంతమైనప్పటికీ భవిష్యత్తులో కూడా ఇలాగే ఆధారాలు లేకుండా ఆరోపిస్తే పవన్ కళ్యాణ్ ఆరోపణలు చులకన అవడం ఖాయంగా కనిపిస్తోంది
-జురాన్