విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటలన్న సేపు సీఎం ప్రసంగించారు. ప్రత్యేక హోదాతో సహా కేంద్రం హామీల గురించి, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్రంతో ప్రభుత్వం అనుసరించిన తీరు… ఇలా అన్ని అంశాలను ప్రస్థావిస్తూ మాట్లాడారు. అయితే, ఆయన ప్రసంగంలోని తనకు కావాల్సిన వాక్యాలను మాత్రమే ‘సాక్షి’ ఏరుకుంది! అవన్నీ గుదిగుచ్చి ఓ కొత్త ప్రసంగ పాఠాన్ని తయారు చేశారు. సీఎం చెప్పిన మాటలకు వెనకా ముందూ ఏమున్నాయో వదిలేశారు.
‘ప్రత్యేక హోదా అడగలేదు’ అంటూ శీర్షిక పెట్టడంలోనే సాక్షి నెగెటివ్ చూపు అర్థం చేసుకోవచ్చు. విభజన సమయంలో ప్రత్యేక హోదా అడగలేదనీ, విభజిత రాష్ట్రానికి మేలు చేయమని కోరితే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందనీ, భాజపా కూడా హామీ ఇచ్చిందనీ, ఆ తరువాత ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి ఆదుకుంటామని చెప్పారని… ఇలా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కానీ, సాక్షికి కావాల్సింది ‘హోదా అడగలేదు’ అనే వాక్యం మాత్రమే! ‘కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే భాజపాతో కలిశానని, కానీ తనను పట్టించుకోలేదు కాబట్టే పోరాటం చేస్తున్నా’.. ఇదీ సాక్షి ఎడిటింగ్. కానీ, కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుందనీ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే భాజపాతో పొత్తు పెట్టుకున్నాననీ, నాలుగేళ్లపాటు ఓపిగ్గా ఎదురుచూశాననీ, సామ దాన భేద మార్గాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాననీ, అప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తుంటే పోరాడాల్సి వచ్చిందని సీఎం చెప్పారు. కానీ, ఇందులో తమకు అనువైన వాక్యాలనే సాక్షి ఏరుకుని రాసింది!
‘ఇన్నాళ్లూ కేంద్రాన్ని హోదా ఎందుకు అడగలేని కొంతమంది అంటున్నారనీ, ముందు నుంచే గొడవ పెట్టుకోవడం మంచిది కాదని చంద్రబాబు చెప్పారు’.. ఇది సాక్షి ఎడిటింగ్! ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే… మొదట్నుంచీ గొడవలు పెట్టుకుంటే రాష్ట్రానికి రావాల్సిన సాయం రాదనీ, గొడవలకే సమయం సరిపోతే రాష్ట్ర అభివృద్ధి సంగతేంటనీ, అందుకే సరైన సమయం వచ్చే వరకూ వేచి చూశాననీ, ఎన్డీయే నుంచి బయటకి రాగానే రాష్ట్ర ఖాతాలో పడ్డ రూ. 350 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకున్నారనీ ఉదహరించారు. కానీ, ఇది సాక్షికి అవసరం లేని మాటలు కదా! ఇలా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తనకు నచ్చినట్టుగా ఎడిట్ చేసింది సాక్షి! ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు ఇష్టం లేదనీ, కేంద్రం దగ్గర భయపడుతున్నారనీ, అహంభావంతో మాట్లాడరనే అర్థం రావాలని.. ఇలాంటి రకరకాల ఇంటెన్షన్స్ తో, విలువలతో కూడిన జర్నలిజాన్ని పాటిస్తూ… ముఖ్యమంత్రి ప్రసంగాన్ని సాక్షి తయారు చేసింది.