హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో తెలుగు సినిమా హీరోలు సమావేశం కానున్నారు. మరి కాసేపట్లో… సుమారు పదిన్నర ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మీడియాలో వస్తున్న కథనాలు, వర్మ ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క చిరంజీవి తప్ప మెగా కుటుంబంలో హీరోలందరూ ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. మెగా కుటుంబంతో సత్సంబంధాలు కలిగిన హీరోలు శ్రీకాంత్, శివబాలాజీ తదితరులు హాజరవడం ఖాయమే. వీళ్లందరినీ పక్కన పెడితే… నందమూరి, దగ్గుబాటి, అక్కినేని, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాల నుంచి ఈ సమావేశానికి ఎవరు వస్తారనేది ఆసక్తికరం.
పవన్ ఏకంగా చంద్రబాబునాయుడు మీద బాణం ఎక్కు పెట్టడంతో నందమూరి కుటుంబం నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదు. అలాగే, దగ్గుబాటి కుటుంబంలో వెంకటేశ్, రానాలకు మెగా కుటుంబ హీరోలతో స్నేహం వుంది. శ్రీరెడ్డి వివాదంలో రానా తమ్ముడు, సురేష్ బాబు రెండో కురుమారుడు అభిరామ్ పేరు బయటకు వచ్చింది. ఆ అంశంపై దగ్గుబాటి కుటుంబం ఇప్పటివరకూ నోరు విప్పలేదు. అభిరామ్ మీద ఎలాంటి అభియోగాలు చేయకుండా వుంటే శ్రీరెడ్డికి ఐదు కోట్లు ఇస్తానని ఆఫర్ చేశానని వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా వస్తారా? లేదా? అనేది చూడాలి. ఇక, మెగా కుటుంబంతో పలు వ్యాపారాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న నాగార్జున స్టెప్ ఏంటనేది హాట్ టాపిక్. ఎవరెవరు ఈ సమావేశానికి హాజరు అవుతారు? అందులో ఏం నిర్ణయిస్తారు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
కొసమెరుపు: ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్దకు పవన్ హాజరైన సమయంలోనూ మీడియాని ఇండస్ట్రీ ప్రముఖులు దూరం పెట్టారు.