భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు ఎవరనే కసరత్తుపై జాతీయ నాయకత్వం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. కానీ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి మొన్న లీకులు వచ్చాయి. అయితే, సోము వీర్రాజుకు కూడా అవకాశం దక్కొచ్చనే ప్రచారమూ మరోపక్క ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ఇప్పుడు ఏపీ భాజపా అధ్యక్షుడిని హుటాహుటిన మార్చడం ద్వారా ఏపీలో భాజపా అనుసరించబోతున్న వ్యూహం ఏంటనేది దాదాపు స్పష్టంగానే ఉంది. ఆంధ్రాలో కాపులను ఆకర్షించాలన్నది భాజపా ముందున్న లక్ష్యం. అందుకే, ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అనుకుంటున్నారు. అయితే, ఆ క్రమంలో సోము వీర్రాజుకి అవకాశం ఇస్తే ఇతర నేతలు ఒప్పుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి!
సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీలో కొనసాగేది లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం! ఇదే అంశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీలోనే మకాం వేశారనీ, అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి సోము వీర్రాజు చేసిందేం లేదనీ, చివరికి కాపుల ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నది లేదని ఆకుల ఆరోపిస్తున్నారు. వీర్రాజుకు అవకాశం ఇస్తే భాజపా ప్రతిష్టకే ఇబ్బంది కలుగుతుందని ఆయన అంటున్నారు. వీర్రాజు వల్ల ఆంధ్రాలో భాజపా అనూహ్యంగా బలోపేతం అయ్యే అవకాశం లేదన్నారు. ఆయనకి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే… గోదావరి జిల్లాల కాపు నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఖాయమని ఆకుల అంటున్నారు.
అయితే, కాపు సామాజిక వర్గ నేతకు అవకాశం ఇస్తేనే ఏపీలో భాజపా పుంజుకుంటుందని అమిత్ షా భావిస్తున్నారట! గత ఎన్నికల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఏపీ కాపులు టీడీపీకి మద్దతు ఇచ్చారనీ, కానీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు ఓటేస్తారనేది భాజపా విశ్లేషణగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో రిజర్వేషన్ల హామీతో చంద్రబాబు కాపులను ఆకర్షించారనీ, కానీ దాన్ని ఇంతవరకూ అమలు చేయలేకపోవడంతో కాపు సామాజిక వర్గం ఆయనపై అసంతృప్తితో ఉందనేది కమలనాథులు లెక్క! సో.. కాపు సామాజిక వర్గంలో ఉన్న టీడీపీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భాజపా ఆశిస్తోందని అర్థమౌతూనే ఉంది. కానీ, అదే సమీకరణల ప్రకారం సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇస్తే, భాజపా ఆశలు పెట్టుకున్న ఆ కాపు వర్గ నేతల నుంచే అసంతృప్తులు వ్యక్తమయ్యే పరిస్థితి తప్పదని ఆకుల మాటల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థి ఎంపికను భాజపా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.