పవన్ కల్యాణ్ హడావుడితో అత్యవసరంగా సమావేశమైన టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్ ల సంఘాలు… మహిళలపై వేధింపుల నిరోధానికి 21 మందితో జాయింట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్ గా యార్లగడ్డ సుప్రియ. సభ్యులుగా నందినీరెడ్డి, స్వప్నాదత్ ఉంటారు. ఈ సమావేశంలో షూటింగుల సమయంలో ఆడవాళ్లకు సౌకర్యాలు కల్పించడం.. అవకాశాల పేరుతో ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిని శిక్షించడం అన్న అంశాలపై చర్చలు జరిపారు. చివరికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ.. సిన రంగంలోని అన్ని క్రాఫ్ట్ ల్లో వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తుంది. బాధితులకు న్యాయం చేస్తుంది.
నిజానికి మెగా ఫ్యామిలీ వత్తిడి కారణంగానే సినీ పరిశ్రమ అత్యవసరంగా సమావేశమైంది. తన తల్లిని దూషించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ… పవన్ కల్యామ్ ఫిల్మ్ చాంబర్ కు వచ్చి కూర్చోవడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. తన తల్లిని శ్రీరెడ్డితో బూతు మాట తిట్టించినట్లు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మను.. సినీ ఇండస్ట్రీలోని అన్ని రకాల వ్యవహారాల నుంచి నిషేధం విధించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న టీవీనైన్, గతంలో ఇండస్ట్రీలోని మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యాత.. మాట్లాడారన్న కారణంగా టీవీ ఫైవ్ పైనా… చర్యలకు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం కదలి వచ్చింది. దీంతో సినీ పెద్దలు కొందరు.. జోక్యం చేసుకోవడంతో పవన్ కల్యాణ్ ఒక్క రోజు డెడ్ లైన్ పెట్టారు.
పవన్ డెడ్ లైన్ ప్రకారం సమావేశమైన… టాలీవుడ్ లోని ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సంఘాలు. పవన్ కల్యాణ్ డిమాండ్లపై పెద్దగా చర్చించలేదు. కానీ శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాలు.. మహిళలకు.. చిత్ర పరిశ్రమలో కల్పించాల్సిన భద్రతపై మాత్రం చర్చించారు. నిర్ణయాలు తీసుకున్నారు. ఓ దర్శకనిర్మాతపై నిషేధం విధిస్తే..చాలా సమస్యలు వస్తాయని… అలాగే మీడియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. లేదా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినా.. వివాదాన్ని పెద్దది చేసుకున్నట్లు అవుతుందని… టాలీవుడ్ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. సమస్య పవన్ కల్యామ్ వ్యక్తిగతమైనదేనన్నట్లుగా కొంద మంది మాట్లాడారు. వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలని మెగా ఫ్యామిలీ తరపున హాజరైనవారికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి టాలీవుడ్ లో వ్యక్తమవుతోంది. .