తెలుగు సినీ మీడియా రాజకీయ రంగాల్లో కుదుపులా వచ్చిన పరిణామాలపై ఛానెళ్ల పెద్దలు అధినేతలు ఆచితూచి స్పందించారు. సహజంగానే దాడులను ఖండించారు. వ్యక్తిగత ఆరోపణలూ బహిష్కరణ పిలుపులూ సరికాదని స్పష్టం చేశారు. ఎవరు ఎలాటి పిలుపులిచ్చినా తాము మాత్రం ఎవరినీ బహిష్కరించవద్దని కూడా భావించారు. సమస్యలు సంవాదాలు సమన్వయపూర్వకంగా పరిష్కరించుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా సానుకూల దిశలో అనుభవజ్ఞుల సలహాలతో నడిచింది.
అయితే మరోవైపున మీడియాలో కొన్ని ఛానెళ్ల ధోరణి, అందులోనూ అగ్రశ్రేణీయుడు అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది.అదేపనిగా అనుచిత వ్యాఖ్యానాలు అవాంఛనీయ వక్తుల అసభ్య భాషా ప్రయోగాలకు అవకాశం కల్పించడం కూడదని అభిప్రాయం వచ్చింది. అయితే అలాటి పిచ్చి కార్యక్రమాలేవనే విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. మా రేటింగు కోసం మేము వేసేది మరోకరికి తప్పుగా అనిపిస్తే వారు చేసేది మాకు తప్పుగా కనిపించవచ్చు. దీన్ని అంతిమంగా తేల్చేదెవరన్న సమస్యకు సమాధానం దొరకలేదు. అయితే ఇప్పుడు ఎదురైన పరిణామాలను బట్టి తక్కువస్థాయి ప్రసారాలు చర్చలూ వివాదాలు తగ్గించాలనే భావం బలంగా వచ్చిందట. ఈ సమావేశంలో అతి కొద్ది మినహాయింపులు తప్ప ఛానళ్ల సంస్థల ప్రతినిధులు దాదాపు పాల్గొన్నారు కాబట్టి దీన్ని సాధికారికంగానే పరిగణించవచ్చు. ఇందులో కొన్ని భాగాలు స్క్రోలింగ్ వేశారు కూడా.
అయితే అప్పటికే ఆంధ్రజ్యోతి ఎబిఎన్ అధినేత ఆర్కే పవన్ కళ్యాణ్‌పై తన అస్త్ర శస్త్రాలు వీకెండ్ కామెంట్ రూపంలో వదులుతున్నారు.ఆదివారం ఆంధ్రజ్యోతి కొత్తపలుకును ఆ విధంగా ప్రసారం చేస్తుంటారన్నది తెలిసిందే. తాము పవన్‌పై ఆమె వాడిన బూతు పదాన్ని బీప్ శబ్దంతో రాకుండా చేశామని అయినా తమను టార్గెట్ చేయడం ఏమిటని ఆ ఛానల్‌లో చర్చలు నడిచాయి. విచిత్రంగా ఆర్కే కొత్త పలుకులో మాత్రం అది బూతే కాదని వాదన ఎత్తుకున్నారు. ఆ పదం తిట్టేవారిని ఉద్దేశించింది తప్ప వారి తల్లిని కాదని గొప్ప విశ్లేషణ దీర్ఘంగా చేశారు. ఇది దారుణంగా వుందని నేను ట్వీట్ చేశాను. ఆర్కే ఆలోచనలతో ఏకీభవించకపోయినా తను అనుకున్న ప్రకారం ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. కెసిఆర్,వైఎస్‌లతో సహా చాలామందిని ఎదిరించి నిలబడ్డారు. ఈ కారణంగా ఆయన ధైర్యంగా వుంటారని భావించేవారిలో నేనొకణ్ణి. పదేళ్లపైబడి ఆ పత్రికలో కాలమిస్టును కూడా. అయినా ఆయన గతంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భజన చేసినప్పుడు ఇలీవల పవన్ కళ్యాణ్ అజ్ఞాని అని పదేపదే వ్యాఖ్చానించినప్పుడు మాత్రం విమర్శించాను. కేంద్రం నుంచి ఎలాటి ప్రతిపాదన లేకున్నా ఆ ప్యాకేజీ తీసుకుని హౌదా వదులుకోవాలని ఈ మధ్య రాసింది కూడా తప్పు పట్టాను. అయితే వీటన్నిటికన్నా ఇప్పుడు ఈ బూతు పంచాంగాన్ని ఆయన సమర్థించడం నాకు చాలా ఎబ్బెట్టుగా దారుణంగా కనిపిపించింది.సంపాదకులు మీడియాధిపతులు చేయవలసింది బూతులను వాడకుండా చూడటం తప్ప విశ్లేషించి కితాబులివ్వడం కాదు. నిజంగా ఈ పదంలో తప్పు లేకపోతే మరి ఎందుకు ప్రసారం చేయకుండా బీప్ శబ్దంతో సరిపెట్టారు? చాలా ఛానళ్లు అదే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ పదం మేము ప్రసారం చేయలేదని సమర్థించుకున్న తప్పుకున్న వాళ్లు మళ్లీ తప్పు లేదని చెప్పడం ఏమిటి? ఆర్కేకే తెలియాలి.
గతంలో ఒకసారి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి తప్పుగా మాట్లాడారు.’తల్లి కడుపున ఎందుకుపుట్టానా అని తలదించుకుంటావ్ చంద్రబాబూ’ అన్నారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. చంద్రబాబు సహజంగానే చాలా బాధపడ్డారు. ఆంధ్రజ్యోతి గమనం శీర్షికలోనే నేను ‘నేతలూ మాతలూ’ అని వ్యాసం రాశాను. తర్వాత వైఎస్ తన మాటలను హుందాగా ఉపసంహరించుకున్నారు. చంద్రబాబు తల్లిగారొకటి నా తల్లిగారొకటి కాదంటూ పొరబాటు సవరించుకున్నారు. ఇక్కడ మాత్రం ఆ పదం ప్రయోగించిన నటి, ప్రేరేపించ్‌ిన దర్శకుడూ అందరూ తప్పు ఒప్పుకున్నట్టు మాట్లాడుతుంటే ఎబిఎన్ కూడా సెన్సార్ చేస్తే ఆర్కే సమర్తిస్తున్నారు. ఇది బొత్తిగా అనుచితం, అర్థరహితం. బూతుల వినియోగమే తప్పంటే విశ్లేషణ మరిెంత పొరబాటు.
– తెలకపల్లి రవి