మెహర్ రమేష్ అనే ఓ దర్శకుడు ఉన్నాడన్న సంగతి చిత్రసీమ మర్చిపోయి చాలా కాలం అయ్యింది. ఆయన తీసిన ఫ్లాపులు అలాంటివి. శక్తి, షాడో సినిమాలతో ఆ రేంజులో భయపెట్టాడు. ఆ తరవాత… ఆయన మీడియాకే చిక్కలేదు. ఇప్పుడు నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ఆడియో ఫంక్షన్లో మెరిశాడు. హైదరాబాద్‌లో ఫంక్షన్ జరిగిందంటే.. అక్కడికి వచ్చాడనుకోవొచ్చు. ఎక్కడో మిలటరీమాధవరంలో ఆడియో ఫంక్షన్ జరిగితే అక్కడ తన ఫ్యామిలీతో సహా హాజరైపోయాడు. అంటే.. మెగా ఫ్యామిలీతో ఏదో ఓ ప్రాజెక్ట్ డీల్ చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడన్నమాట.
అయితే మెహర్ రాక.. సినిమాలతో ముడిపెట్టి చూడకూడదు. అల్లు ఫ్యామిలీతో.. మెహర్‌కి చుట్టరికం ఉంది. అందుకే.. ఈ ఆడియో ఫంక్షన్లో తన ఎంట్రీ జరిగి ఉండొచ్చు. మెహర్ చాలా కాలం నుంచి బన్నీతోనూ, అరవింద్‌తోనూ టచ్‌లో ఉన్నాడు. అరవింద్‌ది పక్కా బిజినెస్ మైండ్. చుట్టరికం ఉన్నంత మాత్రాన సినిమాలు అప్పజెప్పలేడు. మెహర్ ఎంత ప్రయత్నిస్తున్నా – అరవింద్ ఆ అవకాశం ఇవ్వడం లేదని, అయినా సరే.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడని టాక్. మరి మెహర్‌కి మరో అవకాశం దక్కుతుందో, లేదో చూడాలి.