వచ్చే నెల నుంచి ‘ఎన్టీఆర్’ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా కొన్ని ముఖ్యమైన సెట్స్‌ని తీర్చిదిద్దే పనిలో ఉంది చిత్రబృందం. యంగ్ ఎన్టీఆర్ పాత్ర గురించి బాలయ్య తర్జన భర్జనలు పడుతున్నాడు. యవ్వన దశలో ఉన్న ఎన్టీఆర్‌గా బాలయ్య కనిపిస్తే.. చూడ్డానికి ఏమాత్రం బాగోదు. ఎందుకంటే బాలయ్య ఈమధ్య మళ్లీ ఒళ్లు చేశాడు. ఎన్టీఆర్ సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో సన్నగా, నాజూగ్గా ఉండేవారు. శ్రీకృష్ణుడు, రాముడు పాత్రల్లో ఒదిగిపోవడానికి కారణం ఆయన ముఖ వర్చస్సే. పాతికేళ్ల ఎన్టీఆర్‌గా కనిపించడం అరవై ఏళ్ల బాలయ్యకు సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే.. యంగ్ ఎన్టీఆర్‌గా ఓ యువ హీరోని ఎంచుకోవాలని భావించారు. శర్వానంద్ పేరు దాదాపుగా ఖాయమైంది. అయితే ఇప్పుడు `నా స్థానంలో మరో హీరో ఎందుకు` అనే డోలాయమానంలో ఉన్నాడట బాలయ్య. ”చేస్తే నాన్నగారి పాత్ర నేనే చేయాలి” అనేది ఆయన పట్టుదల. అందుకే యంగ్ ఎన్టీఆర్ కథని వీలైనంత కత్తిరించాలని భావిస్తున్నాడు బాలయ్య. చిన్నప్పటి ఎపిసోడ్లను ఎవరితో చేయించినా ఓకే. సినిమాల్లోకి వచ్చాక మాత్రం తానే కనిపించాలి. ఆయా సన్నివేశాల్ని చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్లిపోయి.. ఎయిటీస్ వరకూ చకచక నడిపించేస్తే.. అక్కడి నుంచి ఎన్టీఆర్‌గా కనిపించడానికి బాలయ్యకు పెద్దగా అభ్యంతరం ఉండదు. కాకపోతే.. ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని క్లుప్తంగా వివరిస్తే కథ దెబ్బతింటుంది. రెండు భాగాలుగా సినిమా తీయాలనుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్ కెరీర్‌ని పూర్తి స్థాయిలో తెరకెక్కించడమే మేలు. కానీ.. బాలయ్య మాత్రం యంగ్ ఎన్టీఆర్గానూ తనే కనిపించాలని చెబుతుండడంతో.. తేజ కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాడట. చివరికి ఏం తేలుతుందో చూడాలి.