భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడి ఎంపికపై అధినాయకత్వం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది. పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన తరువాత… కొత్త అధ్యక్షుడి ఎంపిక వెంటనే ఉంటుందన్నారు. కానీ, దాదాపు వారం గడిచిపోతున్నా ఎలాంటి ప్రకటనలూ వెలువడటం లేదు. అధ్యక్ష పదవి రేసులో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఇదే సమయంలో కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ వీడి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క… సోము వీర్రాజుకే భాజపా అధ్యక్ష పదవి అంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఆయనకి పదవి ఇస్తే తాము పార్టీ నుంచి బయటకి వెళ్లిపోతామంటూ ఆకుల సత్యనారాయణ ఇప్పటికే నిరసన గళం వినిపించారు.
ఇక, మిగిలింది మాణిక్యాలరావు మాత్రమే. నిజానికి మాణిక్యాల రావు పేరు దాదాపు ఖరారు అయిపోయిందంటూ ఓ ఐదు రోజుల కిందట ఢిల్లీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. కానీ, దానిపై కూడా భాజపా అధిష్ఠానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు వినిపిస్తూ ఉండటం విశేషం. ఏపీ అధ్యక్ష బాధ్యతల్ని ఒక మాజీ ఉన్నతాధికారికి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోందట. ఇటీవలే అఖిల భారత సర్వీసుల పదవి నుంచి వైదొలగిన ఓ ప్రముఖుడికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం భాజపా వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనకు ఎలాగూ క్లీన్ ఇమేజ్ ఉంది, యువతలో కొంత గుర్తింపు ఉంది కాబట్టి… అలాంటివారికి ఇస్తే ఏపీలో ఇమేజ్ బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి బాధ్యతల్ని కట్టబెట్టడం అనేది భాజపా సంప్రదాయం కాదు. సీనియారిటీ, సిన్సియారిటీ చూశాకనే పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారు. కానీ, ఏపీ విషయంలో ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేసులో ఉన్న నేతల కంటే ఈయనకి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశం పరిశీలనలో ఉందట! ఇటీవలే అఖిల భారత స్వర్వీసుల నుంచి పదవీ విరమణ చేసిందెవరు.. ఇంకెవరు జేడీ లక్ష్మీ నారాయణే కదా!