అవినీతి, నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని భాజపా ఘనంగా చెప్పుకుంటుంది. కానీ, ఇవన్నీ మైకు ముందు ఆవేశాలే! ఎన్నికల దగ్గరకి వచ్చేసరికి… అలాంటి సిద్ధాంతాలన్నీ అటకెక్కిపోతున్నాయి. అధికారం ఒక్కటే పరమావధిగా రాజకీయాలు చేయడంలో భాజపా కూడా అతీతం కాదని మోడీ షా ద్వయం ఆధ్వర్యంలో నిరూపితం అవుతోంది. భాజపా ప్రస్తుత లక్ష్యం.. కర్ణాటక ఎన్నికల్లో విజయం. దాని కోసం పాటుపడే బాధ్యతల్లో సింహభాగం గాలి జనార్థన్ రెడ్డి తీసుకున్నారు! కోర్టు ఆదేశాలున్నాయి కాబట్టి, ఆయన పోటీ చేసే అవకాశం లేదు. అవినీతిపై పోరాటం అంటూ మాట్లాడిన భాజపా, ఇప్పుడు కర్ణాటకలో గాలి సోదరులకు ప్రాధాన్యత ఇస్తోంది!
గాలి సోదరులకు భాజపా టిక్కెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. గాలి జనార్థన్ రెడ్డి అన్నయ్య కరుణాకర్ రెడ్డి హరప్పనహళ్లి నుంచి పోటీకి దిగుతున్నారు. తమ్ముడు సోమశేఖర్ రెడ్డి బళ్లారి నుంచి పోటీకి దిగుతున్నారు. ఇంకా, శ్రీరాములు మేనల్లుడు సురేష్ కంపలి, శ్రీరాములు మేనమామ ఫకీరప్పకు కూడా భాజపా టిక్కట్లు ఇచ్చేసింది. మొత్తంగా చెప్పాలంటే… ఒక్క గాలి జనార్థన్ రెడ్డి కుటుంబం నుంచి ఏడుగురికి భాజపా టిక్కెట్లు ఇచ్చింది. అంతేకాదు, దావణగరె జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని సమీక్షించే బాధ్యతల్ని గాలి జానర్థన్ రెడ్డికి భాజపా కట్టబెట్టడం విశేషం! అంతేకాదు… అసెంబ్లీ ఫ్లోర్ లో లక్ష్మణ్ సవిధితోపాటు నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకి కూడా భాజపా మరోసారి టిక్కెట్లు ఇవ్వడం కూడా విశేషం.
అవినీతిపై పోరాటం అని చెప్పిన భాజపా… పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన గాలి కుటుంబ సభ్యులకు వరుస పెట్టి ఎమ్మెల్యే టిక్కెట్లు పంచేసింది. తెల్లారితే చాలు బేటీ బచావో బేటీ పడావో అంటూ ఊదరగొట్టే భాజపా… అసెంబ్లీ ప్రాంగణంలోనే నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రజాప్రతినిధులకు మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో భాజపా ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూశాక… ఒకప్పుడు కాస్తూకూస్తో సిద్ధాంతాలూ పద్ధతులూ ఉన్నాయనుకునే భాజపా కూడా ఫక్తు రాజకీయాలు నేర్చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవడైతేనేం, గెలవాలి… ఏంచేసైనా అధికారంలోకి వస్తే చాలు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని మోడీ షా ద్వయం స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది.