నేతల వలసలను పరిగణనలోకి తీసుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ బాధిత పార్టీ. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు పార్టీ ఫిరాయించాయి. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఫిరాయింపులకు లెక్కే లేదు. కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో.. వైసీపీకి మూడింట రెండు వంతుల మెజార్టీ ఉన్నా.. ఎమ్మెల్సీ స్థానం .. అదీ వైఎస్ జగన్ సొంత బాబాయ్ పరాజయం పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు వైసీపీ..నేతలను ఆకర్షించడంలో ముందు ఉంది. టిక్కెట్ రాదనుకుంటున్న టీడీపీ నేతలు.. ఎలాగూ పార్టీలోకి వస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలను కూడా.,. వైసీపీ వదలడం లేదు.
బీజేపీతో.. వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందన్న విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగానే వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తారని.. లేకపోతే.. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారని .. ఏదో ఒకటి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే.. బీజేపీ నేతలు ఎవరూ… వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపించరు. బీజేపీలోనే ఉండి తమ సీటు పొత్తులో భాగంగా తమకే వచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ వైఎస్ జగన్… అలాంటి పొత్తులేమీ ఉండవని చెప్పేందుకో… బీజేపీతో ఎలాంటి లాలూచీ లేదని చెప్పేందుకో కానీ.. బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలను టిక్కెట్లు ఖరారు చేసి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఒకరు గుంటూరుకు చెందిన కన్నా లక్ష్మినారాయణ కాగా మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి. వారం తేడాతో వీరిద్దరూ… వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ జెండా కప్పుకోనున్నారు.
వైసీపీలో చేరనున్న బీజేపీ నేతల సంఖ్య వీరితో ఆగిపోయే అవకాశాలేమీ కనిపించడం లేదు. మామూలుగానే బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటిది.. ప్రస్తుతం ఏపీని పూర్తిగా మోసం చేశారన్న ఏకాభిప్రాయం ప్రజల్లో ఉండటంతో… అధికారాకానికి అలవాటు పడిన ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వారిలో కొంత మంది వైసీపీ వైపు చూస్తున్నారు. విశాఖ జిల్లాలోకి జగన్ పాదయాత్ర వస్తే జగన్ ను కలుస్తానని… విష్ణుకుమార్ రాజు లాంటి వారు బహిరంగంగానే చెబుతున్నారు. నిప్పు లేకపోతే పొగరాదన్నట్లు.. ఏ రాజకీయ అవసరం లేకపోతే.. జగన్ లాంటి రాజకీయ పార్టీని.. ఇతర పార్టీల నేతలు ఎందుకు కలుస్తారు..?