మీడియాపై వార్ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేస్తున్న విమర్శలూ ట్వీట్లు చూస్తేనే ఉన్నాం. టీడీపీ తనపై కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మొన్నటి వరకూ తమతో ఉండే పవన్ కల్యాణ్ కూడా తమని విమర్శిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన్ని తాము ఎక్కడా విమర్శించడం లేదన్నది గుర్తించాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తాననీ, ఏదో ఒక విధంగా బురదజల్లే కార్యక్రమాలు చెయ్యనన్నారు. ఏపీ విషయంలో కేంద్రం ఎన్ని విధాలుగా ఆడించాలో అన్ని విధాలుగా ఆడిస్తోందని చెప్పారు.
పత్రికల్లో కొన్ని విషయాలు రాస్తున్నారనీ, అందరినీ గవర్నర్ కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకుని వెళ్లాల్సిన వ్యవస్థ అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పిందన్నారు. గవర్నర్ వ్యవస్థపై పోరాడిన సందర్భాలున్నాయన్నారు. ఢిల్లీలోని భాజపా సర్కారు ఆంధ్రుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, ఇతర రాష్ట్రాల్లో భాజపా ఆటలు సాగుతాయేమోగానీ.. ఆంధ్రాలో అలాంటి పరిస్థితి ఉండదని కేంద్రాన్ని చంద్రబాబు హెచ్చరించారు. తాను ధర్మపోరాటం చేస్తుంటే, రాయలసీమకు వెళ్లి డిక్లరేషన్ ఇస్తారంటూ భాజపాని విమర్శించారు. ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారా అని ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనీ, మీరు చేస్తున్నది తప్పు అని ప్రశ్నించేసరికి… ప్రాంతీయ వాదాలపై స్పందించారు, ప్రతిపక్ష వైకాపాను రెచ్చగొడతారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తార’ని కేంద్రం తీరుపై తీవ్రంగా విమర్శించారు.
మొన్ననే చంద్రబాబును గవర్నర్ కలుసుకున్నారు. ఇవాళ్ల సీఎం ఇంత తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంటే, గవర్నర్ రాజీ ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్థమౌతూనే ఉంది. ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి తెచ్చేందుకు భాజపా చేస్తున్న కుట్రను ప్రజలకు వివరించే ప్రయత్నం చంద్రబాబు మొదలుపెట్టినట్టున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ తీరుపై విమర్శలు చేశారు. అందర్నీ కలిపే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారన్నారు. వైకాపాని భాజపా ఆడిస్తోందన్నారు. ప్రాంతీయ, కుల మత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం భాజపా చేస్తోందని అన్యాపదేశంగా వీటన్నింటినీ లింక్ చేసి చెప్పినట్టుగా ఉంది.