తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇది చినికిచినికి గాలీవానా అన్నట్టుగా… ఎక్కడో మొదలైన చర్చ ఇంకెక్కడికో వెళ్లిపోయింది. రాజకీయ రంగు కూడా పూసేసుకుంది. అయితే, ఈ అంశంపై జాతీయ స్థాయిలో విమర్శలకు ఆస్కారం ఇచ్చేలా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్ దేనికీ అతీతం కాదని ఆమె అంటున్నారు. ఇది అంగీకరించాల్సిన విషయమేననీ, ఇది ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే ఉందా, అన్ని చోట్లా ఉంది కదా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, పార్లమెంటు కూడా దీనికి అతీతం కాదు కదా అన్నట్టు వ్యాఖ్యానించేశారు..! వర్క్ ప్లేసుల్లో మహిళలకు వేధింపులు చాలా ఉన్నాయన్నారు.
తాను మాట్లాడుతున్నది మిగతా మహిళలకు ధైర్యం ఇచ్చేలా ఉండాలనే దీనిపై స్పందిస్తున్నా అన్నారు. మీరూ ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా ఉండడని చెప్పడం కోసమే మాట్లాడుతున్నానన్నారు. శ్రీరెడ్డి వివాదం తనకు తెలీదనీ, కొన్ని వార్తలు మాత్రమే దాని గురించి చూశానని రేణుక అన్నారు. అయితే, ఆమెను వెక్కిరించేవాళ్లు ఎక్కువగా ఉన్నారనీ, ఆమె మాటల్లో ఏదైనా నిజముందా అని ఆలోచించడానికి కూడా మగాళ్లు భయపడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో కూడా ఈ జాడ్యం ఉందా అనే అంశమై ఆమె స్పందిస్తూ… మిగతా రంగాలతో పోల్చుకుంటే రాజకీయాలు చాలా పాదర్శకంగా ఉంటాయన్నారు. రాజకీయాల్లో ఎక్కడా రహస్యాలు ఉండవనీ, ఇలాంటివి ఎక్కడైనా ఉన్నా అవి చాలా అరుదుగా మాత్రమే ఉంటాయని ఆమె చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా మీటూ అనే కేంపెయిన్ జరుగుతోందనీ, అయితే యు టూ అనేది కూడా పెట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు.
పార్లమెంటులో కూడా.. అంటూ పరోక్షంగా రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం ఒకింత చర్చనీయంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది భాజపాకి దొరికిన ఛాన్స్ గా ఆ పార్టీ అభిమానులూ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉందా అంటూ ఎద్దేవాకి అవకాశం ఇచ్చేలా ఉంది. అసలే ఫైర్ బ్రాండ్ నేత. చేసిన కామెంట్లపై ఏదైనా దుమారం రేగినా వెంటనే సారీ చెప్పేసే పరిస్థితి ఉండదు. చూడాలి.. దీనిపై ఇతర పార్టీల స్పందన ఎలా ఉంటుందో..!