గుజరాత్ లోని ధొలేరాపై కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడుతోందో తెలిసిందే. ధొలేరాని భారీ పారిశ్రామిక నగరంగా తీర్చి దిద్దేందుకు మోడీ సర్కారు కృషి చేస్తోంది. అందుకే, చకచకా అనుమతులు వచ్చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు వస్తున్నాయి. భారీ ఎత్తున పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు… ఇలా చాలా హడావుడి జరుగుతోంది. మధురై పోర్టుకి ఆరుగంటల ప్రయాణం, అహ్మదాబాద్ కి రెండే గంటలు, పిపవమ్ పోర్టుకి నాలుగు గంటలే… స్మార్ట్ సిటీ, పరిశ్రమలకు అనువైన వాతావరణం, స్టార్ట్ అప్ లకు వసతులు.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ భారీ ఎత్తున ప్రచారమూ చేస్తున్నారు. మొత్తంగా 2,21,000 ఎకరాల ప్రతిపాదిత నగరంలో కోర్ ఏరియా 5,600 ఎకరాలు
మంచిదే..! దేశంలో వాణిజ్యానికి అత్యంత అనుకూలంగా ఉండే మరో నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మంచిదే. అయితే, ఇక్కడ సమస్యంతా ఎక్కడొస్తోందంటే… మోడీ సొంత రాష్ట్రం, అందునా అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం, లక్షల ఎకరాల్లో నగర నిర్మాణం చేపడుతున్నారు! ఇదంతా మోడీ అభివృద్ధి అని భాజపా నేతలు ప్రచారం చేసుకుంటారు. కానీ, ఆంధ్రాకు వచ్చే సరికి… ముఖ్యంగా అమరావతికి వచ్చేసరికి… మరీ ప్రత్యేకంగా అమరావతి భూసేకరణకు వచ్చేసరికి.. ఇదే భాజపా నేతలు మరోలా మాట్లాడుతున్నారు. కొంతమందితో మాట్లాడిస్తున్నారు. ఇదే ద్వంద్వ వైఖరి అంటే..!
ఆంధ్రా రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అని భాజపా నేతలే విమర్శిస్తున్నారు. ఇక, పవన్ కల్యాణ్ అంటారూ.. ముందుగా కొన్ని ఎకరాల్లో అభివృద్ధి చూపించి, ఆ మోడల్ తో తరువాత భూసేకరణ చేసుకోవాలని ఆ మధ్య సలహా ఇచ్చారు. ఉండవల్లి అంటారూ… 32 వేల ఎకరాల్లో ఎక్కడో మయన్మార్ లో ఏదో నగరం కట్టారనీ, అది శిథిలమైపోయిందని అశుభం పలుకుతారు. ఇక, జగన్ అంటారూ… రాజధాని పేరుతో వేల ఎకరాలు అవసరానికి మించి సేకరించారనీ, దాన్లో దాదాపు 15 వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నారనీ, అడుగడుగునా అవినీతి అంటూ మట్టి నుంచి అమరావతి భూముల దాకా అని ఓ దండకం అందుకుంటారు..!
అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన గుజరాత్ లో వేల ఎకరాల్లో ధొలేరా నిర్మిస్తే… అది అభివృద్ధి. రాజధాని లేని ఆంధ్రాకి అమరావతి నిర్మించతలపెట్టి, భూసేకరణ చేస్తే… ఇది అవినీతి. ధొలేరాకి వేల కోట్ల నిధులు మంజూరు అవుతున్నా మన నేతలు మాట్లాడరు.. అమరావతికి రావాల్సినవి ఎందుకు ఇవ్వరని ఎవ్వరూ ప్రశ్నించరు. సొంత రాష్ట్రం విషయంలో ఒకలా… ఆంధ్రా విషయంలో మరోలా వ్యవహరిస్తున్న మోడీని వీరెవ్వరూ నిలదీయరు..! ఇలాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని.. భాజపా చేయాల్సిన రాజకీయాలు చేస్తూ… అమరావతికి వేల ఎకరాల అవసరమా, వందలు చాలవా అని వీళ్లని రెచ్చగొట్టి మాట్లాడిస్తారు..!