కొంచెం అమాయకత్వం
విపరీతమైన కోపం
పట్టరాని సంతోషం
బీభత్సమైన హ్యుమానిటీ
కొంచెం కన్నింగ్
భయంకరమైన బలుపు
– దూకుడులో బ్రహ్మానందం క్యారెక్టర్లో షేడ్స్ ఇవి – సరిగ్గా ఇన్నో, ఇందులో కొన్నో – బ్రహ్మాజీ ఖాతాలోనూ రాసేసుకోవొచ్చు.
ఎందుకంటే… అతని పాత్రల్లోనూ ఇన్నేసి షేడ్లు కనిపిస్తుంటాయి. ఏ షేడ్ ఇచ్చినా – షేక్ చేసేస్తుంటాడు. బ్రహ్మాజీ బ్రహ్మానందంలా ప్రధాన కమెడియన్ కాకపోవొచ్చు గానీ – దానికి ఏమాత్రం తగ్గడు. సింగిల్ హ్యాండ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించలేడు గానీ – హీరో పక్కనో, విలన్ పక్కనో నిలబడితే – నవ్వులతో పరుగెట్టించేస్తాడు. అందులో ఇన్నేళ్లయినా బ్రహ్మాజీ క్రేజ్ చెక్కు చెదరలేదు. దర్శకులు మారుతున్న కొద్దీ తనకు కొత్త తరహా పాత్రలు పడుతున్నాయి… తనూ చెలరేగిపోతూనే ఉన్నాడు. ఈ వేసవిలో ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు చూసింది. రంగస్థలం, భరత్ అనే నేను రూపంలో. రెండింటిలోనూ బ్రహ్మాజీ ఉన్నాడు. చేసినవి చిన్న పాత్రలే అయినా.. గుర్తుండిపోయే పాత్రలు. రంగస్థలంలో బ్రహ్మాజీకి ఎమోషన్ టచ్ ఇస్తే.. భరత్‌లో కామెడీ టింజ్ కలిపారు. చెప్పాంగా.. ఎలాంటి పాత్రలో అయినా దూసుకుపోతాడని. అలా రెండు సూపర్ హిట్లలో.. తనకంటూ ఓ భాగం దక్కించుకోగలిగాడు.
సింధూరంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ.. ఆ సినిమాలో బాగా నటించాడు. కాకపోతే.. రవితేజ అల్లరి ముందు అది కనిపించకుండా పోయింది. మళ్లీ కృష్ణవంశీనే చంద్రలేఖలో మరో కీలకమైన పాత్ర ఇచ్చాడు. దాన్ని `జ్యూస్` పిండేసినట్టు పిండిపారేశాడు బ్రహ్మాజీ. అయితే శివాజీ ఆతరవాత హీరోగా ప్రయత్నాలు చేయలేదు. ఆ తరహా అవకాశాలూ రాలేదు. హీరో పక్కనో, విలన్ గ్యాంగ్‌లోనో ప్రధాన సభ్యుడిగా కనిపిస్తూ… తన వాటాగా నవ్విస్తూ, భయపెడుతూ చలామణీ అయిపోయాడు. `అతడు` బ్రహ్మాజీకి మరో టర్నింగ్ పాయింట్. అందులో కాస్త అమాయకత్వం ఉన్న విలనిజం పండించాడు. `అన్ని బళ్లెందుకురా బుజ్జీ.. అసలే పెట్రోల్ రేటు పెరిగిపోయింది` అంటూ భరణి కౌంటర్లకు బలైపోయే బుజ్జిగాడులా.. భలే నటించాడు. అప్పటి నుంచి అమాయక చక్రవర్తి పాత్రలు చాలా పడుతూ వచ్చాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ముదురు పెళ్లికొడుకులా.. బ్రహ్మాజీ నటడ బాగా నవ్విస్తుంది. మధ్యమధ్యలో సీరియస్ రోల్స్ కూడా బాగా పోషిస్తూ వచ్చాడు. కానీ ప్రతి పాత్రలో తనదైన టైమింగ్ పండిస్తూ – ఎక్కడా ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. అందుకే… ఇన్నేళ్లయినా… బ్రహ్మాజీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. చిత్రపరిశ్రమకు సీరియర్ కారెక్టర్ల అవసరం చాలా ఉందిప్పుడు. బ్రహ్మాజీ లాంటి వాళ్లు ఆ పాత్రని సమర్థంగా పోషిస్తున్నారు. ఇక ముందు కూడా బ్రహ్మాజీ… మరిన్ని మంచి పాత్రలు పోషించాలని, ఇలానే నవ్విస్తూ తన కెరీర్‌ని ముందుకు నడపాలని తెలుగు 360.కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే బ్రహ్మాజీ గారూ..!!