హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకి దారి తెసిన కారణాలపై విచారణ జరిపేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పంపించిన ఇద్దరు సభ్యుల కమిటీ విచారణ జరిపిన తరువాత దీనికంతటికి కారణం వైస్-ఛాన్సిలర్ అప్పారావే కారణమని తేల్చింది. ఆయన 2001-04సం.ల మధ్య కాలంలో హాస్టల్ ప్రధాన వార్డెన్ గా ఉన్నప్పుడే ఆయన దళిత విద్యార్ధుల పట్ల వివక్ష చూపేవారని, ఆ కారణంగా ఆ సమయంలో కొందరు విద్యార్ధులను ఆయన సస్పెండ్ కూడా చేయడంతో అప్పటి నుంచే దళిత విద్యార్ధులలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉండేదని కనుగొన్నారు. ఆయన వైస్-ఛాన్సిలర్ అయిన తరువాత కూడా వారి మధ్య దూరం ఇంకా పెరిగిందే గానీ తగ్గలేదని కమిటీ కనుగొంది. యూనివర్సిటీ యాజమాన్యం అసమర్ధత కారణంగానే అశాంతి పెరిగిందని కమిటీ సభ్యులు కనుగొన్నారు. అది క్రమంగా పెరుగుతూ చివరికి ఐదుగురు విద్యార్ధుల సస్పెన్షన్, విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకి దారి తీసిందని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ తన నివేదికను శనివారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి సమర్పించుతుంది. ఆ నివేదిక ఆధారంగావైస్-ఛాన్సిలర్ అప్పారావుపై చర్యలు తీసుకోవచ్చును. బహుశః ఆయనను ఆ పదవిలో నుండి తొలగించవచ్చును.
వైస్-ఛాన్సిలర్ అప్పారావు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని వాదిస్తున్నారు.
“ఆ ఐదుగురు విద్యార్ధులపై కటినమయిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నవంబర్ 27,2015న జరిగిన ప్రోటోకాల్ బోర్డు సమావేశంలో నిర్ణయించినపుడు, ఆ విధంగా చేసినట్లయితే వారి చదువులు, జీవితాలు దెబ్బ తింటాయని వాదించి నేనే వారికి విధించిన కటినమయిన క్రమశిక్షణ చర్యలు తగ్గించాను. వారికి హాస్టల్ ప్రవేశం తప్ప యూనివర్సిటీలో మిగిలిన అన్ని సౌకర్యాలు ఉపయోగించుకొనేందుకు అనుమతించాను. ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ నాదగ్గరే మైక్రో బయాలజీ పాఠాలు చెప్పించుకొనేవాడు. అతని మరణం నాకు చాలా బాధ కలిగించింది. త్వరలో అతని తల్లిని కలిసి చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను బీజేపీ మనిషినని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మొత్తం 190 మంది ప్రొఫెసర్లతో పోటీపడి ప్రతిభ ఆధారంగానే నేను ఈ పదవికి ఎంపికయ్యాను తప్ప ఎవరో సిఫార్సు చేయడం వలన కాదు. నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను నా పదవికి రాజీనామా చేయదలచుకోలేదు,” అని అన్నారు.
అయితే కేంద్రమంత్రులు ఇరువురిని కాపాడుకొని ఈ వ్యవహారం ఇక్కడితో ముగించాలంటే ప్రొఫెసర్ అప్పారావుపై వేటు వేయక తప్పదు. శాస్త్రప్రకారం కమిటీ వేయడం, అది అప్పారావుకి వ్యతిరేకంగా నివేదిక సిద్దం చేయడం పూర్తవుతోంది కనుక ఇక ఆయనకి ఉద్వాసన పలకడం కేవలం లాంచన ప్రాయమేనని చెప్పవచ్చును. కానీ ప్రొఫెస్సర్ అప్పారావు కోర్టుకి వెళితే సమస్య ఇంకా జటిలమవుతుంది కనుక ఆయనకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏదో విధంగా సంతృప్తి పరిచే ప్రయత్నం చేయవచ్చును.