విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు సిద్ధమైంది. జనవరిలో రిలీజ్ కావాల్సిన చిత్రమిది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఏప్రిల్ 27న వస్తోంది. అయితే… ప్రమోషన్ల రూపంలో సందడి లేదు. విష్ణు కాస్త హడావుడి చేసే రకమే. కానీ ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. చిన్న సినిమాలకు ఎలాగూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం లేదు. కాస్తో కూస్తో ఫేమస్ అయిన రాజ్ తరుణ్, ఆది లాంటి హీరోల సినిమాలు విడుదలకు ముందే బిజినెస్లు జరుపుకోగలుగుతున్నాయి. కనీసం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో నాలుగు డబ్బులు వస్తున్నాయి. కానీ విష్ణు సినిమా అంటే కొనడానికి ఎవ్వరూ ధైర్యం చేయడం లేదు. రూ.11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రమిది. కనీసం శాటిటైల్ హక్కులు కూడా అమ్ముడు పోలేదు. థియేటర్ అడ్వాన్సులు కూడా రాలేదు. దాంతో అన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విష్ణు – నాగేశ్వరరెడ్డి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. మంచి ఎంటర్టైనర్లుగా నిలిచాయి. ఆహా.. ఓహో అనే స్థాయిలో సినిమాలు లేకున్నా.. కాసిన్ని నవ్వులతో టికెట్టు రేటు గిట్టుబాటు అయిపోయేది. కానీ ఈ సినిమాకేంటో ఇలా జరిగింది??