తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ పై మరోసారి స్పందించారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె. లక్ష్మణ్. అది ఫెడరల్ ఫ్రెంట్ కాదనీ, ఫ్యామిలీ ఫ్రెంట్ అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఎంతో సాయం చేస్తున్న భాజపా సర్కారుపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజుకి 12 గంటలు కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల వరకూ మాత్రమే రాజకీయాలు, ఆ తరువాత అభివృద్ధి అనే మంత్రంగా భాజపా పనితీరు ఉందని చెప్పుకున్నారు. అయినాసరే, తెరాస సర్కారు రాజకీయాలు చేస్తోందన్నారు.
దేశంలోని వైఫల్యమైన కొన్ని రాజకీయ పార్టీలను వెంటేసుకుని మూడో ఫ్రెంట్, లేదా ఫెడరల్ ఫ్రెంట్ అంటూ ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మోడీ విధానాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు ఆమోదముద్ర వేస్తున్న పరిస్థితిని వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నామనీ, ఇలాంటి సమయంలో మోడీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు కూటమి కడితే ప్రజలు ఎలా నమ్ముతారని తెరాసను ప్రశ్నించారు. అభివృద్ధి ఒక్కటే కొలమానమనీ, అందుకే భాజపాకి ఆదరణ లభిస్తోందని లక్ష్మణ్ చెప్పారు.
మోడీ పాలనపై ఇతర రాష్ట్రాలు సంతృప్తిగా ఉంటే ఉండొచ్చు. అది వారి అనుభవంలోకి వచ్చిన అభివృద్ధికి సంబంధించిన విషయం కదా! కానీ, ఎక్కడో త్రిపుర ఫలితాలను, లేదా మరో రాష్ట్ర ఎన్నికలను తీసుకొచ్చి… అక్కడి ప్రజల తీర్పు మోడీకి అనుకూలంగా ఉంటే… తెలంగాణలో వ్యతిరేకమని తెరాస విమర్శించడమేంటీ అనే వాదనను లక్ష్మణ్ వినిపిస్తున్నారు. భాజపా విషయంలో ఏ రాష్ట్ర ప్రజలకు ఉండాల్సిన అభిప్రాయాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకరి అనుభవాలు మరొకరి మార్గ దర్శకాలు కావిక్కడ! తెలంగాణలో కూడా మోడీ విధానాలపై కొంత అసంతృప్తి ఉంది. కేంద్ర నిధుల కేటాయింపుల విషయంలోనూ తెరాస కొంత అసంతృప్తిగా ఉంది. అందుకే కదా, కాంగ్రెస్ తోపాటు భాజపా వ్యతిరేక విధానాన్ని కేసీఆర్ తలకెత్తుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో అభిమానిస్తున్నారు కాబట్టి, మీరెందుకు భాజపాకి వ్యతిరేకంగా ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నిస్తే ఎలా..?