ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైంది. గత పది రోజులుగా ”ఈ సినిమా నేను చేయలేను..” అంటూ బాలయ్యతో చెబుతూ వస్తున్నాడు తేజ. బాలయ్య కూడా తేజని బుజ్జగించే పనిలో ఉన్నాడు. కాకపోతే నాలుగు రోజుల క్రితం.. ఈ సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా.. అంటూ మళ్లీ వేడుకున్నాడట. దాంతో బాలయ్య కూడా ‘మీ ఇష్టం’ అంటూ దారి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు కూడా తేజ – బాలయ్య మధ్య ఓ మీటింగ్ జరిగిందని, ఇప్పటికీ బాలయ్య తేజవైపే మొగ్గు చూపిస్తున్నాడని కానీ తేజ మాత్రం ఈ ప్రాజెక్టుని దాదాపుగా వదిలేశాడని టాక్.
తేజ ఈసినిమా వదులుకోవడానికి ప్రధాన కారణం… పని ఒత్తిడి. ఎన్టీఆర్ బయోపిక్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. దాన్ని అందుకోకపోతే… తేజ వైపే వేళ్లన్నీ చూపిస్తాయి. రాక రాక ఈమధ్యే ఓ హిట్టొచ్చింది తేజకు. ఈ ట్రాక్‌ని పాడు చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మరోవైపు వెంకటేష్ సినిమా చేయాల్సిరావడం, అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ మొదలు కావడంతో తేజ పూర్తి ఒత్తిడిలో పడిపోయాడు.
పైగా ఎన్టీఆర్ స్క్రిప్టు తాను రాయలేదు. కథ ఎలా ఉండబోతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? అనే విషయాల్లో తేజకు ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పటికే తయారైన స్క్రిప్టుని ‘బాలయ్య ఆదేశాల’ అనుగుణంగా సినిమాగా తీయాలి. ఇలాంటి స్కూలు తేజకు పూర్తిగా కొత్త. తాను అనుకున్నది అనుకున్నట్టు తీయడం, తనకు నచ్చిన వాళ్లతో పనిచేయడం తేజ అలవాటు. కానీ ఇక్కడ ఆ స్వేచ్ఛ లేదు. స్క్రిప్టు విషయంలోనే కాదు, నటీనటుల ఎంపిక విషయంలోనూ బాలయ్యదే అంతిమ తీర్పు. అందుకే.. తేజ ఇమడలేకపోయి ఉండొచ్చు.
బాలయ్య లాంటి నటుడ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బోయపాటి, క్రిష్ లాంటి వాళ్లకు అది సాధ్యమైంది. స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయడం తేజకు తెలియని విషయం. తాను చెప్పినట్టు నడుచుకుంటారనే.. కొత్తవాళ్లతో తేజ సినిమాలు తీస్తుంటాడు. బాలయ్య లాంటి స్టార్‌తో సినిమా చేయడం వెనుక ఉన్న కష్ట నష్టాలేంటో తేజకు తెలుసు. అందుకే.. స్వచ్ఛందంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడు. తేజ బయటకు వచ్చేయడం దాదాపు ఖాయం. ఆ ప్రకటన అధికారికంగా రావడమే తరువాయి.