ఎప్పుడైతే తేజ ‘ఎన్టీఆర్’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడో.. అప్పుడు మరో ప్రశ్న తలెత్తడం ఖాయం. ‘మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు?’ అని. నందమూరి బాలకృష్ణ దగ్గర కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. కె.రాఘవేంద్రరావు, క్రిష్, కృష్ణవంశీ, పూరిలలో ఎవరో ఒకరి చేతుల్లో ఈ సినిమా పెట్టొచ్చు. తేజ కూడా…’ఈ సినిమాని కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయొచ్చు’ అంటూ ఓ హింట్ ఇచ్చారు మీడియాకు. ”ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఎన్టీఆర్ బయోపిక్‌ని హ్యాండిల్ చేయలేను. నేను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని. కాకపోతే ఆయన కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనేమో అనిపించింది” అంటూ అసలు కారణం చెప్పేశారు తేజ. అయితే కె.రాఘవేంద్రరావు కూడా ఎన్టీఆర్ బయోపిక్‌కి నో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నిజానికి తేజ కంటే ముందు ఈ సినిమా కె.రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లింది. ఆ రోజే ‘ఈ సినిమా నేను చేయలేను’ అని రాఘవేంద్రరావు క్లియర్‌గా చెప్పేశార్ట. తేజ తప్పుకోవొచ్చని ఎప్పుడైతే బాలయ్యకు హింట్ అందిందో.. అప్పటి నుంచీ ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. అందులో భాగంగానే కె.రాఘవేంద్రరావుని కలసి ఈ సినిమా గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా రాఘవేంద్రరావు సినిమా చేయడానికి సముఖత చూపించడం లేదు. ఇటీవలే టీడీడీ ఛానల్ ఛైర్మన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు రాఘవేంద్రరావు. దాంతో పాటు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ బిజీలో.. సినిమా బాధ్యతలు నెత్తిమీద వేసుకోవడం కరెక్ట్ కాదని ఆయన భావించార్ట. ఈ విషయమే… బాలయ్యకు సున్నితంగా చెప్పారట. దాంతో కె.రాఘవేంద్రరావు అనే ఆప్షన్ కూడా పక్కన పెట్టేయాల్సివచ్చింది.
క్రిష్ ‘మణికర్ణిక’ బిజీలో ఉన్నాడు. ఆయన ఖాళీ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఇక మిగిలింది కృష్ణవంశీ, పూరి. ‘రైతు’ సినిమా ఆగిపోవడంతో బాలయ్య కృష్ణవంశీకి ఓ సినిమా బాకీ పడినట్టు అయ్యింది. ఇప్పుడు ఆ బాకీ తీర్చుకునే అవకాశం వచ్చింది. ‘పైసా వసూల్’ తరవాత పూరితో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు బాలయ్య. సో… పూరి కూడా రేసులో ఉన్నట్టే.