ఇటీవల సైకిల్ ర్యాలీ సందర్భంగా తనపై మంత్రి అఖిలప్రియ వర్గం దాడి చేసిందంటూ ఆరోపిస్తున్నారు సుబ్బారెడ్డి. ఆ వర్గమే దాడి చేసిందనడానికి తనదగ్గర ఆధారాలున్నాయనీ, దాడికి పాల్పడ్డవారు ఇప్పటికీ అఖిలప్రియ ఇంటి దగ్గరే ఉన్నారని ఆయన అంటున్నారు. అయితే, ఈ దాడి ఘటనపై చర్చించేందుకు భూమా అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. సీఎం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని సుబ్బారెడ్డి కలుసుకున్నారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. కానీ, ఈ భేటీకి అఖిలప్రియ హాజరు కాలేదు.
సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తానేం చేసినా పార్టీ కోసమే చేస్తున్నాను కదా, అయినాసరే తనపై ఈ దాడులు ఏంటో అర్థం కావడం లేదన్నారు. భూమా కుటుంబంతో తనది 35 ఏళ్ల స్నేహమనీ, మొత్తం ఫ్యాక్షన్ ను తన భుజస్కందాలపై మోసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాను అన్నారు. ఈ క్రమంలో తన అనుచరులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారనీ, తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ అండగా నిలిచానన్నారు. అలాంటి తనపై అఖిల ప్రియ దాడి చేయిస్తోందంటే… తనకు అర్థం కావడం లేదన్నారు. నంద్యాలలోగానీ, ఆళ్లగడ్డలోగానీ జరిగే ఏ కార్యక్రమానికీ తనను అఖిలప్రియ పిలవడం లేదన్నారు. కేవలం తన ఉనికి చాటుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేశాననీ, అది కూడా పార్టీ కోసమే చేశానని ఆయన అంటున్నారు.
నిజానికి, ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తుంటే, పార్టీ ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో సుబ్బారెడ్డి చెప్పారు. అక్కడి నుంచే అఖిలప్రియ వ్యవహారశైలి మారిందనీ అంటారు! అంతేకాదు, ఆళ్లగడ్డ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సుబ్బారెడ్డికి సీఎం గతంలో సూచించారనే కథనాలూ ఉన్నాయి. సో.. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి సైకిల్ ర్యాలీ చేయడం, దాడి జరగడం చోటు చేసుకుంది. మొత్తానికి, ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకి చేరింది. ఒకే పార్టీలోని రెండు వర్గాలనూ ఎలా శాంతపరుస్తారో చూడాలి. భూమా కుటుంబానికీ, సుబ్బారెడ్డికీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిపోయిన మాట వాస్తవమే. అయితే, ఈ విభేదాలు వచ్చే ఎన్నికల్లో పార్టీని ప్రభావితం చేయకుండా ఉండేలా చూడటమే టీడీపీ ముందున్న సవాల్ అని చెప్పొచ్చు.