తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు మరోసారి పొడిగింపు ఇచ్చేది లేదని.. కేంద్రం స్పష్టం చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ.ఎస్.ఎల్ నరసింహన్.. గవర్నర్గా పదకొండేళ్ల పాటు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఇంత కాలం పాటు ఓ గవర్నర్ పదవిలో ఉండటం అసాధారణమైన విషయం. ఎందుకంటే…గవర్నర్ అనేది ఓ రాజకీయ పదవి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలనే…రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమిస్తారు. దానికా ఆయా పార్టీలు … తమ రాజకీయ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అలాంటిది… రాజకీయ పార్టీలతో సంబంధం లేని నరసింహన్.. కాంగ్రెస్ హయాంలో చత్తీస్ఘడ్ గవర్నర్ గా నియమితులై… ఇన్చార్జ్ గా .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి.. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా సుదీర్ఘ కాలం పనిచేయడం విశేషమే. తనకు గవర్నర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి….బీజేపీ అధికారంలోకి వచ్చినా .. ఆయనకు స్థానచలనం కలగలేదంటే… చాలా ప్రత్యేకత ఉన్నట్లే.
తన పదవిని కాపాడుకోవడానికి ఆయన బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి.. రాజకీయ సలహాలు, నివేదికలు ఇచ్చి… తానే ప్రత్యేకంగా చొరవ తీసుకుని.. బీజేపీ కోసం ఇతర పార్టీల నేతలతో మాట్లాడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ నరసింహన్ వీటిని నిర్ధ్వంద్వంగా తోసిపుచ్చుతారు. కానీ ఆయనతో సమావేశమై బయటకు వచ్చే నేతలు మాత్రం… నరసింహన్ కచ్చితంగా రాజకీయ ఎజెండాతో ఉన్నారని చెప్పుకొస్తారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై… ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలతో ఆయన… ప్రభుత్వానికే మద్దతుగా మాట్లాడారు. దాంతో కాంగ్రెస్ నేతలు…. తీవ్రంగా మండిపడ్డారు. ఇదే కాదు.. ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులతోనూ.. ఆయన సవ్యంగా మాట్లాడిన దాఖలాల్లేవని ప్రచారం. అందుకే ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు గవర్నర్ వైపు వెళ్లడం లేదు.
ఇప్పుడు ఆయనకు పొడిగింపు ఇవ్వడం లేదని కేంద్రమే చెబుతున్నందున.. ఏపీకి మళ్లీ ఉమ్మడి గవర్నర్ వస్తారా..? లేక వేర్వేరుగా గవర్నర్లను నియమిస్తారా అన్న అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమయింది. నిజానికి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది. ఈ బాధ్యతను తాను తీసుకున్నట్లు నరసింహన్ ప్రకటించినా.. కార్యాచరణలో మాత్రం… ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఒక వేళ వేర్వేరు గవర్నర్లను నియమిస్తే కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ పార్టీల్లో నడుస్తోంది. అలాగే ఉమ్మడి గవర్నర్ ను నియమించినా… రాజకీయ సమస్యలు రావొచ్చు. ఎందుకంటే… ప్రస్తుతం కేంద్రం గవర్నర్లను నయమిస్తే. వారు ఆరెస్సెస్ నాయకులే అవుతారు. వారు రాజకీయాలు చేయకుండా ఉండరు.