తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదని… రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చాయి. విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. అసెంబ్లీ సీట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని..అది ఇప్పట్లో సాధ్యం కాదని.. కేంద్రం గతంలోనే తేల్చి చెప్పిందని ప్రచారం జరిగింది. అయితే సీట్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని.. దానికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ఢిల్లీ అధికారవర్గాలు చెప్పినా… కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు పట్టుబట్టినా… ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇష్టం లేనందున… కోల్డ్ స్టోరేజీలో పడిపోయింది.
కానీ ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఈ విషయం బయటకు వచ్చింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రెండూ… సీట్ల పెంపు గురించి ఆలోచించడమే మానేశాయి. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు విషయంలో కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం .. హోంశాఖను కోరింది. వెంటనే ఆలస్యం చేయకుండా.. కేంద్ర హోంశాక.. కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన వివరాలను వీలైనంత త్వరగా అందివ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాలను 175 నుంచి 225 కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153 కు పెంచాలి. కొన్ని నెలల కిందట కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించి కొంత కసరత్తు చేసినప్పటికీ, సీట్ల పెంపు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. రాజకీయ కారణాలతో నిలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో.. ఇక నియోజకవర్గాల పునర్విభజన ఉండదని భావించారు. తాజాగా రెండు రాష్ట్రాలకు హోంశాఖ నుంచి అందిన లేఖలో మరోసారి ఆశలు చిగురించాయి. పోలవరం ప్రాజెక్ట్ కోసం.. కేంద్రం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపింది. వీటి విషయంలో క్లారిటీ కోసమైనా… నియోజకవర్గాల పునర్విభజన చేయక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.