ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు సహజమే. మంచి చెడులు తప్పకుండా ఉంటాయ్. తొలితరం తెలుగు సినిమా తారల్లో బాగా బతికిన కొందరు చివరి రోజుల్లో వ్యక్తిగతంగా కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. బహుశా.. మహానటి సావిత్రి ఆ కోవలోకి వస్తారేమో. ఎందుకంటే… సావిత్రి చివరి రోజుల్లో ఎన్నో కష్టనష్టాలు పడ్డారని ప్రచారంలో వుంది. ఆమెపై తీసిన ‘మహానటి’లో అవన్నీ చూపిస్తారట. జీవితంలో సావిత్రి ఉన్నత శిఖరాలను చేరుకున్న తీరునూ… అలాగే ఆమె పతనావస్థనూ… చిత్రంలో చూపించమని నిర్మాతలలో ఒకరైన స్వప్నాదత్ తెలిపారు. అంటే… సావిత్రి జీవితంలో మంచీ చెడులను చూపించినట్టే. ఈ చిత్రంతో సావిత్రి జీవితం గురించి వినిపిస్తున్న పుకార్లకు చెక్ పడే అవకాశముంది. బయోపిక్ అంటే సినిమా తారలు బాగా బతికున్న రోజులను మాత్రమే చూపించాలని కొందరు భావిస్తున్న తరుణమిది. ‘మహానటి’ దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ విషయంలో సాహసం చేస్తున్నట్టే.